పనాజీ: భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. వెంటనే త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో పర్యటించాలని ఆయన సూచించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని సర్దిన్హా చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం వెనుకబడింది. అందుకే గోవా మాజీ సీఎం ప్రాన్సిస్కో సర్దిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ఆపి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సలహా ఇచ్చారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,570 కిలోమీటర్ల పాటు యాత్ర సాగనుంది. ఇప్పటికే 4 తమిళనాడు, కేరళలో పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం కొనసాగుతోన్న కర్ణాటకతో కలుపుకుంటే 16 జిల్లాల్లో ఇప్పటికే యాత్ర పూర్తైంది. రాహుల్ వెయ్యిమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నికల నాటికి గుజరాత్‌లో రాహుల్‌తో రెండో విడత భారత్ జోడో యాత్ర ప్రారంభింప చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇటు కర్ణాటకలో సాగుతున్న భారత్ జోడో యాత్ర 39వ రోజు ఆదివారం బళ్లారి నుంచి మెకా వరకు సాగింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా పాదయాత్రకు ఈరోజు బ్రేక్ ఇచ్చారు..