అక్రమంగా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు
చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు బాణసంచా విక్రేతలు పాటించాల్సిందే
టపాసులు అక్రమంగా విక్రయిస్తున్న, నిల్వచేసిన వెంటనే డయల్ -100 కు సమాచారమివ్వండి
జిల్లా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి ఐపీఎస్
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 12,నంద్యాల:
నంద్యాల జిల్లాలో అక్రమంగా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి ఐపీఎస్ గారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాణసంచా విక్రయ లైసెన్స్ కల్గిన దుకాణదారులు మాత్రమే అమ్మాలని… మిగతా ఎవరు విక్రయించినా చట్ట వ్యతిరేకమేనన్నారు. దీపావళి పురస్కరించుకుని జిల్లాలో టపాసుల అక్రమ నిలువలు అక్రమ విక్రయాలు జరుగకుండా ఉండేందుకు… లైసెన్స్ కల్గిన దుకాణదారులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరిస్తూ జిల్లా ఎస్.పి గారు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాశ్వత & తాత్కాలిక లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే బాణసంచా అమ్మాలి. తాత్కాలిక లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. నియమ నిబంధనలు పక్కాగా పాటించాలి. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పరిసరాల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో తగు సూచనలు చేస్తూ బోర్డులను ప్రదర్శనలో ఉంచాలని ఎస్.పి తెలిపారు. 18 సంవత్సరాలలోపు పిల్లలను విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా, నిల్వ చేసినట్లు తెలిస్తే వెంటనే డయల్ – 100 కు సమాచారం చేరవేయాలని సూచించారు. బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని చేరవేసిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్.పి శ్రీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు.