*తిరుమలలో సూర్యప్రభ వాహనంపై ఏడుకొండల శ్రీనివాసుని దర్శనం*
తిరుమల 03 అక్టోబర్ :- తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. వజ్ర కవచం ధరించి ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా నాలుగు మాడ వీధుల్లో సూర్య మండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనేనని భక్తులకు బోధిస్తూ స్వామివారు దర్శమిచ్చారు. నయనాందకరమైన ఈ అపురూర ఘట్టాన్ని వీక్షించిన భక్తులు ఆనందమయం చెందారు. భక్తకోటి గోవింద నామస్మరణతో సప్తగిరులు ప్రతిధ్వనించాయి.
వజ్ర కవచం ధరించిన సప్తగిరీశుడు సూర్యకిరణాలు వెలుగులో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో సూర్యమండలం మధ్యనున్న నారాయణమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు . ఈ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్షంగా చూసిన భక్తకోటికి రాజ్యాంగపరమైన అధికారులతో కార్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆదిమధ్యాంతరహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. పగలు సూర్యప్రభ వాహనంలో విహరించిన వేంకటాచలపతి రాత్రి అమృత కిరణాలు కలిగిన చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహినీ అలంకారంతో దర్శనమిస్తూ భక్తులకు అమృత విద్యను బోధిస్తారు. ఈ వాహనంలో స్వామివారిని దర్శించుకుంటే మంచి ఆరోగ్యం ప్రసాదిస్తారు.