ప్రభుత్వం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం…
అవసరమైన వయోవృద్ధులకు ఇంటికే భోజనం
సీనియర్ సిటిజన్ల కోసం మండలాల వారీగా కమిటీలు
వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక అధికారి
సేద తీరేందుకు అనేక పార్కులు, నెక్లెస్ రోడ్, శిల్పారామం
- ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా… మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇన్నాళ్లు, ఈ వయసు వచ్చేవరకు వృద్ధులు మన కోసం ఎంతో సేవ చేశారని తిరిగి ఇప్పుడు వారికోసం మనకు చేతనైనంత సేవ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ రెవెన్యూ మీటింగ్ హాల్ లో మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వయోవృద్ధులకు మంత్రి సన్మానం చేశారు. కే గంగయ్య అనే సీనియర్ సిటిజన్ ను మంత్రి సన్మానించి పాదాభివందనం చేశారు.
జీవితకాలం పిల్లలు సమాజం కోసం ఎంతో సేవ చేసిన వయోవృద్ధులకు తిరిగి మనం ఎంత చేసినా తక్కువేనని మంత్రి తెలిపారు. వయోవృద్ధుల కోసం పట్టణానికి సమీపంలోనే సుమారు రెండు ఎకరాల స్థలంలో ప్రభుత్వం త్వరలోనే వృద్ధాశ్రమం నిర్మించబోతుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వృద్ధాశ్రమం పక్కనే అనాధ శరణాలయం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు అడిగిన వెంటనే మంజూరి చేయించి వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీ హద్వారా ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లకు ధీటుగా 64 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని ఈ సౌకర్యాన్ని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గురువారం వయవృద్ధుల కోసమే ప్రత్యేకంగా పీహెచ్సీలలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఒకప్పుడు జిల్లాలో తాగునీరు కూడా లేక వయోవృద్ధులు ఎంతో ఇబ్బందులు పడేవారని… రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిత్యం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పని చేస్తుంటే… ప్రతి అభివృద్ధి పనిని ధ్యేయంగా కొందరు ఆటంకాలు సృష్టిస్తున్నారని, కానీ మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, శిల్పారామం వంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత వయోవృద్ధులు సేన తీరేందుకు చక్కని అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం మండలాల వారిగా కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆదెరువు లేని, అవసరమైన వారికి శాంతనారాయణ గౌడ్ ట్రస్ట్ ద్వారా ఇంటికి భోజనం పంపించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొడుకుల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్న వృద్ధులకు అవసరమైన సాయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక లైజనింగ్ అధికారిని నియమించినట్లు మంత్రి తెలిపారు. నాగరాజు 9440662543 నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.