ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కానీ.. నైట్ అయితేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనకా త్వరగా నిద్ర రాదు..లైట్స్ ఆపేయాలి, ఇంకా గురకల సౌండ్, ఫోన్లో మాట్లాడుతున్నాడో అరుస్తున్నాడో అన్నట్లు ఆ శబ్ధాలు వామ్మో ఇవన్నీ ట్రైన్ జర్నీలో ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి కదూ..!! ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. రాత్రిపూట ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా నిబంధనలను మార్చబోతోంది.
రాత్రిపూట నిద్రించే సమయంలో శబ్ధం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం తరచుగా మనం చూస్తుంటాం. దీంతో ప్రయాణికులు రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు పడుతుంటారు. రాత్రిపూట కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల నిద్రిస్తున్నప్పుడు కోచ్‌లో ఇతరులతో బిగ్గరగా మాట్లాడటం, బిగ్గరగా సంగీతం వినడం లేదా కాల్‌లో మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల శబ్దం చేయకూడదని రైల్వే ప్రజలకు కఠినమైన సూచనలు చేసింది. దీనికి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు త్వరలో అమలులోకి రానున్నాయి.. నిబంధనలు పాటించకపోతే జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్‌లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు. ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.
ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు వారికి జరిమానా విధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి నిద్రించే సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని రైల్వే అధికారులు అతనికి మొదటిసారిగా హెచ్చరిస్తారు. అయితే మీరు రాత్రిపూట వీడియో చూస్తున్నట్లయితే.. మీరు ఇయర్‌ఫోన్ వంటివి వాడొచ్చు.. తద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు. రూల్స్ తెలియక తప్పు చేస్తే జరిమానా కట్టక తప్పదు.