టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు
ఇదేం దేశం, ఇదే మతం అనడాన్ని తప్పు పట్టిన “బక్కని”
సనాతన ధర్మానికి వ్యంగ్య భాష్యం సరికాదు
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాద తయారి వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పోలీట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే
బక్కని నర్సింలు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ ఈ దేశాన్ని అదేవిధంగా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న మాటలు సరికావని ఇది చాలా పెద్ద దేశద్రోహం అని అన్నారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గురించి ఇదేం దేశం ఇదే మతం అంటూ ప్రజల మనోభావాలను హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
తిరుమలలో రైకానస ఆగమశాస్త్రం ద్వారా పూజా కైంకర్యాలు నడుస్తున్నాయని, పంచరత్రం ద్వారా పూజలు జరుగుతుంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం సంస్కృతి సాంప్రదాయాలు నియమ నిబంధనల ప్రకారం అన్య మతస్తులు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదని విమర్శించారు. జగన్ అన్యమతస్తుడు అన్న విషయం ప్రపంచం అందరికీ తెలుసని, ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నిబంధనలు పాటించకూడదా? తిరుపతి నియమ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల్లో తిరుపతికి వచ్చిన ముఖ్యమంత్రి శాసనాలను రక్షించకుండా వాటిని అపహాస్యం చేయడం ఏమాత్రం తగదని అన్నారు.
జగన్ తిరుమల పర్యటనకు వస్తే డిక్లరేషన్ పై తప్పకుండా సంతకం తీసుకుంటామని టీటీటీ కూడా ప్రకటించిందని, ఈ నేపథ్యంలో జగన్ వెనక్కి తగ్గారని తిరుమల టూర్ కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకొని మళ్లీ ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత పవిత్రంగా ఉండాలో అక్కడ పనిచేసే వారు కానీ ఉద్యోగులు కానీ ఇతర సిబ్బంది చివరకు అర్చకులు సైతం సప్త వ్యసనాలు లేని వారిని అర్చకులుగా నియమిస్తారని ఆయన “తిరుమల చరితామృతం” పుస్తకం గురించి వివరించారు. సప్త వ్యసనాలు జూదం, దొంగతనం, వేటాడడం, ఈర్ష్యా, స్త్రీ లోలులు, ప్రేమ, దయ లేనివారు ఇక్కడ సేవలు చేయడానికి అనర్హులని ఈ సందర్భంగా వివరించారు. ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుపతి దేవస్థానాన్ని మలినం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు..