హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా కూల్చివేసింది.
శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హైడ్రా, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ- జీహెచ్ఎంసీ, నీటి పారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను చెరువులో నిర్మించారంటూ అధికారులు దాన్ని కూల్చేశారు.
ఈ ప్రాంతం హైటెక్ సిటీలోని శిల్పారామం ఎదురుగా ఉన్న రోడ్డులో ఉంటుంది.
ప్రొక్లెయినర్ల సాయంతో ఎన్ కన్వెన్షన్‌కు చెందిన షెడ్లు, ఫంక్షన్ హాలు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు.
ఈ కూల్చివేతలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి.
ఈ సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్ కన్వెన్షన్‌కు వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు.\
ఎన్ కన్వెన్షన్‌పై వివాదం ఏమిటి?
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ రెవెన్యూ పరిధిలో దాదాపు 29.6 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది.
ఇది ఆక్రమణలకు గురవుతూ రానురాను కుంచించుకుపోయినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ చెబుతోంది.
ఈ చెరువు పక్కనే సర్వే నెంబర్ 11/2లో దాదాపు మూడు ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఏసీ ఫంక్షన్ హాల్, ఆఫీస్, డైమండ్ హాల్ సహా కొన్ని నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి.
ఎన్ కన్వెన్షన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దీన్ని ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ తరఫున నిర్మించారు.
ఈ ఎన్3 ఎంటర్‌ప్రైజెస్‌ను అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి ఏర్పాటు చేశారు. వీరిద్దరూ సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నడుపుతున్నారు.
తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ అంటే ఫుల్ ట్యాంకు లెవల్, బఫర్ జోన్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంపై ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఇదే విషయంపై అందిన ఫిర్యాదులతో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు.
BBCహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఆగస్ట్ 21న లేఖ రాసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ, రహదారులు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
”తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ, రహదారులు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఆగస్ట్ 21న లేఖ రాశారు.
”తమ్మిడికుంట తూర్పు వైపున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుంది. చెరువు ఉన్న వైపున రిటైనింగ్ వాల్ నిర్మించారు. మట్టి వేసి చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేశారు” అని లేఖలో పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఎఫ్‌టీఎల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్‌ను కూడా లేఖకు జత చేసి హైడ్రా కమిషనర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కార్యాలయం మినహా మిగతా అన్ని నిర్మాణాలను కూల్చేశారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే..
ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంకు లెవల్ – ఎఫ్‌టీఎల్ అంటారు. ఆ తర్వాత చెరువు పరిధి బట్టి కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో పట్టా భూములు కూడా ఉన్నాయి. తమ్మిడికుంట చెరువు దగ్గర కూడా కొన్ని పట్టా భూములు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూడా అలాంటి పట్టా భూమిలోనే ఉంది.
అయితే, పట్టా భూమి అయినప్పటికీ నీటి పారుదల శాఖ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు.
ప్రైవేటు లేదా పట్టా భూములు ఉన్నప్పటికీ, అక్కడ కేవలం వ్యవసాయం చేయడం లేదా మొక్కలు పెంచుకోవడం, నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే అనుమతులు ఇస్తారు.
శాశ్వతంగా ఉండే ఏ నిర్మాణమూ చేయడానికి వీలుండదు.
అయితే, తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది.
గతంలో వివాదం ఏమిటంటే..
ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో పదేళ్లుగా వివాదం నడుస్తోంది.
2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గురుకుల్ ట్రస్టు భూముల్లో అయ్యప్ప సొసైటీ నిర్మించారనే ఆరోపణలపై అక్కడి కొన్ని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయించింది.
అదే సమయంలో ”చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారు” అంటూ ఫిర్యాదులు అందాయి.
అదే ఏడాది జులై, ఆగస్ట్ నెలల్లో హెచ్ఎండీఏ, నీటి పారుదల విభాగం, రెవెన్యూ అధికారులు తమ్మిడికుంట చెరువు పరిసరాల్లో సర్వే చేశారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చెందిన కొన్ని నిర్మాణాలు వస్తాయని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అప్పట్లో హద్దులు నిర్ణయించారు.
హెచ్ఎండీఏ చేపట్టిన సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం.
ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టలేదు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..
తమ్మిడికుంటలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
”తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ భవనాలు నిర్మించారని, వాటికి అనుమతులు లేవు” అని ఆయన తెలిపారు.
”2014లో తమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను గుర్తిస్తూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ ఇచ్చింది”
”2014లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌టీఎల్ నిర్ధరించడంపై చట్టప్రకారం నడుచుకోవాలని హైకోర్టు చెప్పింది. దాని ప్రకారమే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలో మరోసారి ఎఫ్‌టీఎల్ సర్వే నిర్వహించారు. సర్వే నివేదికను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి కూడా ఇచ్చారు”
”ఈ సర్వే నివేదికపై 2017లో ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఇందులో ఎక్కడా స్టే ఆర్డర్లు లేవు” అని రంగనాథ్ పేర్కొన్నారు.
”ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తూ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తోంది” అని ఆయన చెప్పారు.
”ఎఫ్‌టీఎల్ పరిధిలోని 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2.18 ఎకరాలలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. ఆ తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్- బీఆర్‌ఎస్ కింద ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు తిరస్కరించారు” అని రంగనాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కూల్చివేతలపై నాగార్జున ఏమన్నారంటే..
”ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చట్టవిరుద్ధం, బాధాకరం” అని చెప్పారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
”స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరం. అది పట్టా భూమి. చెరువును ఒక్క అంగుళం ఆక్రమించలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైంది. ఇప్పుడు తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా కూల్చివేత జరిగింది” అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
”ముందుగా మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, నేనే దాన్ని కూల్చేసేవాడిని” అని ట్వీట్ చేశారు నాగార్జున.
స్టే ఇచ్చేసరికే కూల్చివేతలు పూర్తి
ఒకవైపు ఎన్ కన్వెన్షన్‌లో కూల్చివేతలు జరుగుతుండగా.. మరోవైపు నాగార్జున తరఫున తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
దీనిని విచారించిన జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఈ ఆదేశాలు వచ్చేసరికే ఎన్ కన్వెన్షన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.
తమ్మిడికుంట మరోవైపు నిర్మాణాల కూల్చివేత
తమ్మిడికుంటకు తూర్పువైపున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంతోపాటు పశ్చిమ ప్రాంతంలో మరికొన్ని నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు.
వాటర్ ట్యాంకులు నిర్మించి కొందరు ప్రైవేటు వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లను ప్రొక్లెయినర్ల సాయంతో కూల్చివేశారు.