అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్క చెల్లెల్లు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తారు. కానీ ఉన్న ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా, సహోదరుని సమాధి వద్ద సహోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్క చెల్లెల్లు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గూగులోతు లింగయ్య, సత్తవలకు రాజమ్మ, బులమ్మ, శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా, నరసింహ నాయక్ ఒక్కగానొక్క కుమారుడు. నరసింహ నాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014లో చత్తీస్గడ్ లో నక్సల్స్ అమర్చిన మందు పాతర పేలి వీరమరణం చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఏటా నరసింహ నాయక్ సమాధి వద్ద ఏర్పాటుచేసిన విగ్రహానికి అక్కాచెల్లెళ్ళు రాఖీలు కడుతూ, విగ్రహంలో తమ సహోదరున్ని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహ నాయక్ అక్క చెల్లెళ్లకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది.