స్టూడియో 10 టీవీ స్టాప్ రిపోర్టర్ కే బి రాజు :
పార్కులు పచ్చదనంతో ఆహ్లాదానికి నెలవుగా ఉండాలని శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం పచ్చదనం పెంపుకు మరింత కృషి జరగాలన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని యూసుఫ్ గూడ సర్కిల్‌లో కృష్ణకాంత్ పార్కు , యూసుఫ్ గూడ బస్తీ, బోరబండ, ఆర్‌కే కాలనీ , కల్యాణ్ నగర్‌లలో అధికారులతో కలిసి జడ్సీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణకాంత్ పార్కు ఎంతో చారిత్రాత్మకమైనదని దాని ప్రత్యేకతను కాపాడుకుంటూ మరింతగా పచ్చదనంతో ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్కులోపల ఎటువంటి చెత్త సహా గ్రీన్ వేస్ట్ లేకుండా చూడాలని, చెట్లను సంరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటూ నూతన మొక్కలను నాటాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. వాకింగ్ సహా కుటుంబంతో సేద దీరేందుకు వచ్చే ప్రజానీకం పార్కులోపలి పచ్చదనంతో ఎంతో ఆహ్లాదాన్ని పొందేలా తీర్చిదిద్దాలన్నారు. కాలనీలలో పారిశుద్ద్య పనులను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించాలని సూచించారు. రహదారులపై వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, గుంతలను ఎప్పటికపుడు పూడ్చివేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ ఆధ్వర్యంలో తగు నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. ఆయన వెంట డీసీ నాయక్ , అనీల్‌కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.