రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది.
రైతు అకాల మరణం లేదా సహజ మరణం చెందితే ఆయన కుటుంబం వీధిన పడొద్దనే ఉద్దేశంతో సర్కారు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వమే జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు ప్రీమియం చెల్లించి మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రమాద బీమా సొమ్మును అందిస్తోంది. ఏటా ప్రభుత్వమే రెన్యూవల్ చేస్తోంది. ఈ సంవత్సరం జూన్ 28 వరకు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న వారు కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాలో మార్పులు, లేదా నామిని చనిపోతే పేరు మార్పు కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చేయాల్సింది ఇలా..
వ్యవసాయ భూమి కొనుగోలు చేసినా లేక తమ పేరిట భూమి మార్పిడి చేసుకున్న వ్యవసాయ భూమిని ధరణిలో పట్టా చేయించుకున్న రైతులు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 1965 ఆగస్టు 14 నుంచి 2006 ఆగస్టు 14 మధ్యలో జన్మించిన రైతులు అర్హులు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ జిరాక్స్ ప్రతులతో కలిపి రైతు బీమా ఫారంలో వివరాలు నమోదు చేసి పట్టాదారు స్వయంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి అందజేసి నమోదు చేయించుకోవాలి.