నార్సింగి : ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం పెరిగడం, వాటి నియంత్రణ కొరకు ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం కనబడుతుంది. మాదక ద్రవ్యాలకు ఎక్కువ శాతం యువత ఆకర్షితులై తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నివారణకు పూనుకున్న ప్రభుత్వం పిల్లలలో వాటి పై అవగాహన పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. మాదక ద్రవ్యాల పట్ల పిల్లల్లో అవగాహన కొరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు మురళీ మోహన్ ఆధ్వర్యం లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై వ్యాస రచన, చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్సింగి పోలీస్ ఏఎస్ఐ మాణిక్ ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్ ప్రభు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల జీవితాల పై పడే దుష్పరిణామాలను వివరించారు. చెడు స్నేహాల వల్ల చెడు వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడతారని, స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఒక సారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత విచక్షణ కోల్పోతారని, వాటికి బానిసలుగా మారి వాటికి సమకూర్చుకోవడానికి అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సి వస్తుందని, మత్తులో ఎంతటి ఘోరాన్నైన చేసేస్తారని, దానివల్ల బంగారు భవిష్యత్తును కోల్పోయి జైలు పాలు అవుతారని వివరించారు. మాదక ద్రవ్యాలు, ఇతరత్రా చెడు వ్యసనాల తో దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏం.ఎన్.ఓ రామకృష్ణా, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.