ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి*:: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
మహబూబాబాద్, జూన్.22
శనివారం ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అద్యక్షతన ముఖ్య అతిదిగా రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్,ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మునిసిపల్ చైర్ పర్సన్ డాక్టర్ పాల్వాయి రాం మెహన్ రెడ్డి లతో కలిసి సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు సీతక్క గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేలా సమీక్షలు నిర్వహించి, టార్గెట్ లను నిర్దేశించుకొని పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు న్యాయంగా లబ్ధిదారులకు అందేలా, స్మార్ట్ గా ఆలోచించి టెక్నీకల్ గా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఉత్తమ విద్యను అందించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో మత్తు పదార్థాల పై అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఐ.టి.డి.ఏ పరిధిలోని మండలం కేంద్రాలలో గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలో ట్రైబల్ వెల్ఫెర్ వసతి గృహాలలో చుట్టు పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలని, రోజు వారీగా హాస్టళ్లను తనిఖీ చేయాలని , అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించి విద్యాబోధన, నాణ్యమైన భోజనం అందించాలని, సరకుల అక్రమ రవాణా జరుగకుండా కఠినంగా వ్యవహరించి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాలపై దృష్టి సారించి జిల్లాలోని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని, ఎరువుల, విత్తనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా సాంక్షన్ అయి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ఎక్కువగా పెండింగ్ ఉన్న పనులలో కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కల్వర్టు నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా ఫారెస్టు డిపార్ట్మెంట్ సమన్వయం తో పనుల పూర్తికి సహకరించాలని అన్నారు. సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ పాఠశాలల్లో పరిశుభ్ర వాతావరణం, నాణ్యమైన ఆహారం పిల్లలకు అందించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ద్వారా మొక్కలు అందుబాటులో ఉంచుకొని, గ్రామానికి చివరలో పండ్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళ ఆర్థికాభివృద్ధి కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం ద్వారా ఆమోదించిన యూనిట్లకు బెనిఫిషరీస్ గుర్తింపు త్వరగా జరగాలని అన్నారు. జిల్లాలో మహిళా క్యాoటీన్ లను ప్రారంభించడానికి అనువైన స్థలాలను గుర్తించాలని అన్నారు. మహిళల ఆర్దికాభివ్రుద్దికి తోడ్పడేందుకు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అధికారులు అందించాలన్నారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, నిరంతరం గస్తీ నిర్వహించాలని, గంజాయి కేంద్రాలను గుర్తించాలని అన్నారు. చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని పోలీసు అధికారులకు సూచించారు.
ఎం.పి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ గ్రామాలలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గవర్నమెంట్ దవాఖాన కు వచ్చే రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, డాక్టర్లు పేషేంట్లకు జబ్బులకు తగ్గట్టుగా మందులుగాని, ట్రీట్మెంట్ గాని ఇవ్వాలని మోతాదుకు మించి డోసు ఇవ్వకూడదని అన్నారు. అధికారులు స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని, మేల్, ఫీమేల్ నిష్పత్తి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాలో ట్రాన్స్కో అధికారులు వ్రేలాడే కరెంటు తీగలను సరిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రమాదవశాత్తు జరిగే మరణాలను నివారించాలని, నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఏమేమి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో అవగాహన కల్పించాలని, భూ పరీక్షల నమూనాలను సేకరించాలని అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీం ఎక్కువ మందికి లబ్దిచేకూరేలా చూడాలని మంత్రిని కోరారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూఅధికారులు సామాజిక భాద్యతో పనిచేయాలని విద్య, వైద్యంపై నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి అవసరాలను తీర్చాలన్నారు. రౌడీ షీటర్లపై, భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా లో క్రైమ్ రేటును తగ్గించాలని అన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ గ్రామాల్లో నర్సరీలలో ఉన్నటువంటి పండ్ల మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ అవసరాలకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అవసమైన పనులను చేపట్టాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామానికి అవసరమైన పనులను ఆమోదించి పనిచేయాలని అన్నారు. జిల్లాలో సికిల్ సెల్ వ్యాధి బారిన పడిన వారిని ప్రత్యేక దృష్టితో తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పరచాలని అన్నారు. గ్రామాల్లో క్యాoపు లను నిర్వహించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్యులు హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్దులకు ఆరోగ్య పరమైన పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గ్రామాలలో వర్షాకాల ప్రభావం వలన ప్రజలు జబ్బుల బారిన పడకుండా అధికారులు త్రాగునీరు, పరిశుభ్రతపై ద్రుష్టి సారించాలని మండల వైద్య కేంద్రాలలో ఎప్పటికప్పుడు అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా వైద్యాధికారులు చూసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా లోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చదువుపట్ల ప్రత్యేక దృష్టి సారించామని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని మౌలికమైన,వసతులతో కూడిన విద్యా బోధన, పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, జిల్లాలో పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తమంగా వచ్చాయని, అదే విధంగా పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందని, మహిళల ఆర్థిక అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించామని, అంగన్ వాడీ లు, నర్సరీలలో పండ్ల చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటామని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని, గ్రామాలలో ప్రత్యేక అధికారులతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ బత్తిని విశాల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ చెన్నయ్య, జెడ్పీ ఇంచార్జి సీ.ఈ.ఓ నర్మద, పంచాయతీ రాజ్ ఎస్.ఈ సురేష్ వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.