పోలీస్ అధికారుల ర్యాలీ
స్టూడియో 10 టీవీ న్యూస్, మే20, మహానంది:
ఎన్నికలను పురస్కరించుకొని గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహానంది మండలం గోపవరం గ్రామంలో పోలీసులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, ఇంకా 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలా సహకరించారో అలాగే ఓట్ల లెక్కింపుకు ప్రజల శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలన్నారు. ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక గ్రామాల్లో అభ్యర్థుల తరఫున జరుపుకునే, విజయోత్సవాలు టపాసులు కాల్చడం, ఈలలు కేకలు వేయడం వంటివి నిషిద్ధమన్నారు అధికారుల అనుమతులు లేని వారు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు ఎవరు రాకూడదన్నారు. అక్కడ కూడా 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిబంధనలు అధిక్రమించిన వారిపై పోలీస్ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్, గోస్పాడు ఎస్సై నాగార్జున రెడ్డి, బండి ఆత్మకూరు ఎస్సై మల్లికార్జున, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.