హాట్ టాపిక్…అ నాలుగు స్థానాల్లో పరిస్థితి ఏంటి?

NEWS

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎం లలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 ఉదయం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలనుంది.

అయితే ఈ నెల 13న పోలింగ్ భారీ ఎత్తున జరగడంతో ఫలితాలపై రెండు రకాల అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రంలో నాలుగు అత్యంత కీలక, ఆసక్తికర స్థానాల ఫలితాలపై చర్చ మొదలైంది.

అవును… ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. గత నలభై ఏళ్లలో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా కూటమి నేతలు భావిస్తుండగా… కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికి వస్తాయనే భయంతో జనం పోటెత్తారని, అదంతా ప్రో గవర్నమెంట్ ఓటని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ఈసారి ఎన్నికల్లో నాలుగు స్థానాలను వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు. ఆ నాలుగు స్థానాల్లో ఎలాగైన జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావించారు! వీటిలోని మూడు స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాలు.. చర్చలో ఉన్న విషయాలనూ ఇప్పుడు పరిశీలిద్దాం…!

కుప్పంలో కొట్టగలరా..?:

కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు కంచుకోట. ఇక్కడ చంద్రబాబుకు ఎదురులేదు, తిరుగులేదనే చెప్పాలి. అయితే ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబుని ఓడించాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకూ చూడని అభివృద్ధిని చూపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ సత్తా చాటడం.. చంద్రబాబు మునుపెన్నడూ లేనివిధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేయడం తెలిసిందే. ఈ సమయంలో… కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని అంటారు. అయితే అది అంత ఈజీ కాదనేది అంతా చెబుతున్న మాట.

వాస్తవానికి ఇక్కడ వైసీపీ… చంద్రబాబుని ఓడించకపోయినా బలమైన పోటీ ఇచ్చి, కౌంటింగ్ రోజు టెన్షన్ పెట్టించి, మెజారిటీని భారీగా తగ్గిస్తే అది కచ్చితంగా నైతిక విజయం అనే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పిఠాపురంలో పరిస్థితి..?:

ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశం అయిన నియోజకవర్గం పిఠాపురం అనేది తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో… ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లి తెర నటీ నటులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు.

ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్… వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి, తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది. విజయం ఎవరిని వరించబోతుందనేది అత్యంత కీలక అంశంగా మారింది.

మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతారా..?:

2014 – 19 సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కేపై 5,337 ఓట్లతో ఓడిపోయారు. అయితే… ఈ సారి ఆ నెంబర్ కి పక్కన సున్నా కలిపి… ఏభై వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తానని చెబుతున్నారు.

మరోపక్క లోకేష్ పై పోటీకి మురుగుడు లావణ్యను బరిలోకి దించారు జగన్. ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేటాయించి, వ్యూహాలు అమలుచేశారని చెబుతున్నారు. మరి ఈసారైనా చినబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి!

హిందూపురంలో హ్యాట్రిక్ సాధ్యమేనా..?:

హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేశారు. 2014 లో 16వేలు, 2019లో 18వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించిన బాలయ్య… ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్సయ్యారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పైగా ఈ సారి కూటమి అధికారంలోకి వచ్చి, బాలయ్య గెలిస్తే కేబినెట్ లో ఉంటారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

మరోవైపు బాలయ్యపై ఈసారి బీసీ అస్త్రం ప్రయోగించారు జగన్. ఇందులో భాగంగా… కోడూరి దీపిక ను రంగంలోకి దింపారు. అయితే వేవ్ మాత్రం బాలయ్య వైపు ఉందని కథనాలొస్తున్నప్పటికీ… బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటిపైకి వచ్చారనే చర్చ కూడా వినిపిస్తుండటం గమనార్హం!

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!