కన్నడీగులతో పోటెత్తిన మహానంది క్షేత్రం

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రం బుధవారం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు మహానంది క్షేత్రానికి తరలివచ్చారు. కన్నడ భక్తులు శ్రీశైలం మల్లన్న, భ్రమరాంబ దర్శనం చేసుకొని, ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం రోజున శ్రీశైల మల్లన్న రథోత్సవం దర్శించి, తదనంతరం కన్నడ భక్తులు అధిక సంఖ్యలో మహానందికి చేరుకున్నారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని, అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

క్షేత్రానికి వచ్చే కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయానికి సమీపంలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. భక్తులకు వాహనాలు నిలిపే స్థలంలో చల్లని త్రాగు నీరు, ఆలయానికి వచ్చే దారి మధ్యలో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ తదితర సౌకర్యాలు కల్పించారు. క్షేత్రం ప్రవేశద్వారం నుండి ఎండ వేడిమి నుండి భక్తులకు రక్షణ కల్పించడానికి టెంట్లు, పెండల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 6:30 నుండి 10 గంటల వరకు ఉచిత దర్శన ఏర్పాట్లు ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా, చంటి పిల్లలు ఉన్న మహిళలు, వృద్దులు వికలాంగులకు ప్రత్యేకంగా వెళ్లేందుకు అనుమతించారు.

కన్నడ భక్తులకు క్షేత్రంలో ప్రవేశించిన సందర్భంలో ఉచితంగా బిస్కెట్లను కూడా పంపిణీ చేసి, ఉచిత దర్శనం అనుమతించారు. క్షేత్ర పరిసరాల్లో కన్నడ భక్తుల కోసం ఉచిత అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను కూడా దాతలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేచి ఉండకుండా త్వరగా దర్శనం చేసుకుని, తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో ఉన్న అన్ని ద్వారాలను తెరచి ఉంచి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించారు. కన్నడ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక నంది వాహన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వామివారి దర్శనం అంతరం కన్నడ భక్తులు ఎక్కువ సంఖ్యలో కర్రలు, చాటలు కొనుగోలు చేసి,సాంప్రదాయబద్ధంగా తమ ఇండ్లకు తీసుకువెళ్లడం జరిగింది.మహానందిపుణ్యక్షేత్రంనకు దైవదర్శనానికి వచ్చే కన్నడ భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భగవాన్ దాస్, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీహెచ్ఈవో హుస్సేన్ రెడ్డి తెలిపారు.ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాట్లు చేసి, భక్తుల భద్రత కోసం సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సుతో కూడా పర్యవేక్షించడం జరిగింది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!