తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం
హీరోయిన్లను కేటీఆర్ బెదిరించారంటూ ఆరోపణలు
తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీస్తామన్న కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నమయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఈ అంశంపై ఈరోజు తెలంగాణ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ మంత్రి అన్నారని… ఇలాంటి అసత్య ఆరోపణలు చేసేవారిని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రైనా, సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఏ హీరోయిన్ తో తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన ఖర్మ తనకేముందని అన్నారు. తప్పుడు ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.