ఆదిలాబాద్:- ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు అందించాలంటే తమ్మడిహట్టి వద్ద సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేవలం 1850 ఎకరాల భూమి మాత్రమే అవసరమన్నారు.తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఏ గ్రామం మునగదు, ఎవరికి నష్టం ఉండదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా నష్టపోయిన నష్టపరిహారం అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకు మీరు (ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ) ఒక్క మాట చెబితే మహారాష్ట్ర అంగీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి కీలక రిక్వెస్ట్ చేశారు. సోమవారం ప్రధాని మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా దాదాపు 7 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి పై రిక్వెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి ప్రధాని మోడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి మరీ.