*బాబు-పవన్ కూటమికి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి – ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి*
తిరుపతి నగరం ( స్టూడియో 10 న్యూస్ )
చంద్రబాబు-పవన్ కూటమికి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి నగరంలోని 8,19,31,46 డివిజన్ల సచివాలయాల పరిధిలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభల్లో ప్రజలనుద్దేశించి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల కాలంలో తిరుపతి నగర ప్రజలకు వివిధ పథకాల కింద 1700 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారని చెప్పారు. ఇందులో భాగంగా 8వ డివిజన్ కు 35 కోట్లు, 19వ డివిజన్ కు 20 కోట్లు, 31వ డివిజన్ కు 25 కోట్లు, 46వ డివిజన్ ప్రజలకు 34 కోట్ల సహాయం చేశారని ఆయన చెప్పారు. జగనన్న ఓట్ల కోసం మాత్రమే జనానికి సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తారని భూమన విమర్శించారు. జగనన్న హయాంలో తిరుపతిలో 2లక్షల 10వేల మందికి పార్టీ, కులం, మతం చూడకుండా 1700 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అందించామన్నారు. 26 వేల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా ఇస్తామని తెలిపారు. 5500 కుటుంబాలు 60 ఏళ్ళుగా ఎదుర్కుంటున్న 22ఎ సమస్యను పరిష్కరించి వారికి ఇంటి స్థలాల మీద చట్టపరమైన హక్కులు కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో మరో 12 వేల మందికి 22ఎ సమస్య నుండి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నామని కరుణాకర రెడ్డి వివరించారు. 6 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేశామని, మిగిలిన వారికి కూడా ఇంటిస్థలాలు అందించే ప్రక్రియ నడుస్తోందని ఆయన తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న 6వేల మంది పారిశుధ్య కార్మికులకు 5 వేల జీతం పెంచామన్నారు. తిరుపతి నగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి వాటికి మహనీయుల పేర్లు పెట్టామని, అనేక చోట్ల ఫ్రీ లెఫ్ట్ లు ఏర్పాటు చేశామని, కొర్లగుంట, తాతయ్యగుంట గంగమ్మ గుడి, నవాబ్ పేట ప్రాంతాల రోడ్లు గతంలో ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో గుర్తించాలన్నారు. జగనన్న హయాంలో కొత్త తిరుపతిని నిర్మిస్తున్నామని చెప్పారు. గంగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపజేసి ఘనంగా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 23వ తేదీ నుండి పది రోజుల పాటు జరిగే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి లక్షన్నర మంది తిరుపతి వాసులకు దర్శనం చేయించే ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగడానికి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కరుణాకర రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తిరుపతి మునిరామిరెడ్డి, ఆరణి సంధ్య, సి.కె. రేవతి, పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దూది శివకుమార్, సురేంధ్రనాధ్ రెడ్డి, పడమటి కుమార్, దేవదానం, బాలిశెట్టి కిశోర్, సి.కె.రవి, బాలకుమార్ రెడ్డి, కిశోర్, మురళీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.