స్పందన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి
మండల స్థాయి స్పందనకు 45 దరఖాస్తులు
-జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 13, మహానంది:
జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహానంది మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య ఇతర జిల్లాధికారులు దరఖాస్తుదారుల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. మహానంది మండలంలో రీఓపెన్ అయిన కేసులు 33 ఉన్నాయని, ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించకపోవడం వల్లే మళ్ళీ మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయన్నారు. ఇక్కడికి వస్తున్న సమస్యలన్నీ మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలే వున్నాయని, స్థానిక అధికారులే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతిరోజు సచివాలయాల్లో 3 నుండి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సర్వీసులకు సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకుని నిర్దేశిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు.
మండల స్థాయి స్పందనలో కొన్ని వినతులు…
1)పుణ్యక్షేత్రమైన మహానంది నుండి అగ్రికల్చర్ కాలేజీ వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైనందని మరమ్మతులు చేయించవలసిందిగా మండల జర్నలిస్టులు కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.2)మహానంది మండలం చెంచులక్ష్మి గూడెం ప్రజలు తెలుగుగంగ ప్రధాన కాలువ బర్రెల బ్రిడ్జి సమీపంలో 11 సంవత్సరాలుగా 66 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని,త్రాగునీటి సమస్యపై కలెక్టర్ కి మొర పెట్టుకోగా మాకు నీళ్ళ టాంక్ మంజూరు చేశారని, టాంక్ పనులు ప్రారంభిస్తుంటే అటవీ శాఖాధికారులు నిర్మాణాన్ని అడ్డుకుని పనులను నిలిపివేస్తున్నారని, కావున మాపై దయవుంచి మా సమస్యను పరిష్కరించి త్రాగునీటి టాంక్ నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరుతూ చెంచులక్ష్మి గూడెం ప్రజలు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు. మండల స్థాయి స్పందన కార్యక్రమంలో 45 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సిఈ ఓ సుబ్బారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, తహసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి, ఎస్సై నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.