తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా భవానీ లీలావతమ్మ…
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 20, మహానంది:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 24వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న’ నారీ సాహిత్య భేరి’అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై, తెలుగు భాషా సేవకు గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం అందుకున్న తిమ్మాపురం గ్రామం జడ్పీహెచ్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు భవాని లీలావతమ్మ ను ప్రత్యేక అతిథిగా తానా సంస్థ వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భవాని లీలావతమ్మ మాట్లాడుతూ తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో కవిత్వం వినిపించడానికి తనకు విశిష్టమైన స్థానం కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ టి. ప్రసాద్, సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే సాహిత్య సమ్మేళనం ఇది అన్నారు. ఈ కార్యక్రమం భారతదేశంతో పాటు సుమారు 15 దేశాల కవయిత్రులు, రచయిత్రులు, ప్రముఖ సాహిత్య మహిళలు పాల్గొంటారు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో జరిగే ఈ కార్యక్రమం పదికి పైగా మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేస్తారన్నారు. యాప్ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు, అమెరికా వంటి దేశాల్లో ఈటీవీ, భారత్, మన టీవీ ,తెలుగు వన్ కానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్ వంటి చానల్లో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలలో తనను ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. భవాని లీలావతమ్మ నంద్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై తెలుగు భాషా సేవకు గాను గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్ వంటి నగరాల లో ఎన్నో పురస్కారాలు పొందారు. అవధానాలలో పృచ్చకత్వం వహించారు. తమ పాఠశాల విద్యార్థులచే పద్య వచన కవితలు రాయించి సంపాదకత్వం వహించారు. వీరికి తానా వేదికపై అవకాశం రావడం సంతోషంగా ఉందని తిమ్మాపురం పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, నంద్యాల జిల్లా కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.