*యావత్ తెలంగాణకే చీమల్దరి ఆదర్శం!*
*చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్రెడ్డి*
*గ్రామంలో ఉచిత వైఫై సేవల ప్రారంభం*
మోమిన్పేట్:
యావత్ తెలంగాణ రాష్ట్రానికే చీమల్దరి గ్రామం ఆదర్శమని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లను ఎదుర్కొని చీమల్దరి నేడు ఈ ప్రగతిని సాధించిందని అన్నారు. చీమల్దరి గ్రామం పూర్తిగా 100 శాతం డిజిటలైజేషన్ గ్రామం(ఈ-విలేజ్)గా పేరుగాంచిందని కొనియాడారు. మంగళవారం భారత 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమలదరి గ్రామ పంచాయతీ-బీఎస్ఎన్ఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సేవలను చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎంఎల్ఏ మెతుకు ఆనంద్, చీమలదరి సర్పంచ్ నాసన్ పల్లి నర్సింహ్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన ఈ గ్రామంలో పారదర్శకంగా ఇంటర్నెట్ సేవలందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంత మారుమూల ప్రాంతంలోని ఈ గ్రామం ఉచిత వైఫై సేవలు అందించడంలో స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి కృషి ఎనలేదని అన్నారు. ఎవరు గ్రామంలోకి వచ్చినా… తక్షణమే ఇంటర్ నెట్ ఆన్ చేసి ఉంటే ఓటిపి వస్తుందని సంబందిత ఓటిపి ద్వారా వైఫై కనెక్ట్ అవుతుందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామాన్ని రూపొందించటం జరిగిందని వ్యాఖ్యానించారు. తాను ఐటీ విభాగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని… అయితే, తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఒక ఈ-విలేజ్ ఉండటం గర్వంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలు చీమల్దరి మాదిరి ఐటీలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పన, అత్యాధునిక టెక్నాలజీని ప్రభుత్వ శాఖల్లో సమర్థంగా వినియోగిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను సమర్థంగా వాడుకునేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ఐటీ శాఖ పని చేస్తుందని వివరించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మిషన్ లెర్నింగ్, బిగ్ డాటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లను ఐటీ రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. వీటి ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కార్యకాలాపాలు, సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకొంటున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం చిత్తశుద్ధితో ఉన్నదని ఎంపీ రంజిత్రెడ్డి పునరుద్ఘాటించారు.