*ఏడాదితో పాటు మరో ఐదేళ్లూ చంద్రబాబుకు నిద్ర కరువే – తిరుపతి ఎమ్మెల్యే భూమన*
తిరుపతి( స్టూడియో 10 న్యూస్)
*మరోమారు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి ప్రజా మద్దతుతో వస్తారని, ఈ ఏడాదితో పాటు మరో ఐదేళ్ళు చంద్రబాబుకు నిద్ర కరువు అయ్యేలా చేయడం జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి 30వ డివిజన్ నెహ్రూ నగర్లో శుక్రవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని రకాల మోసపూరిత ప్రకటనలు చేసినా, చేయించినా రానున్న ఎన్నికల్లో గెలుపు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లుతో, ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మరో సారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భూమన అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్న తమకు ప్రజాభిప్రాయం స్పష్టమైందన్నారు. కేవలం ప్రెస్ క్లబ్ ల్లో కూర్చుని పత్రికా సమావేశాల నిర్వహణకే పరిమితమైన వారికి వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రతిపక్షాలనుద్దేశించి ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు భయపడి, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు పేపర్ పులులంతా ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిద్ర లేకుండా చేశారని, ఈ ఏడాదితో పాటు మరో ఐదేళ్లూ చంద్రబాబు నిద్రపోయే పరిస్థితి లేదని భూమన స్పష్టం చేసారు. శాసనసభ పూర్తి కాలం సరిగ్గా ముగిసిన తర్వాతే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబును, చంద్రబాబును సమర్థించే పవన్ కల్యాణ్ ను జగన్ మోహన్ రెడ్డి ఓటు అనే వజ్రాయుధంతో నరుకుతారని భూమన ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ కల్పనా యాదవ్, స్టేట్ మైనార్టి కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్, స్టేట్ ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు, రవి, శ్రీనూ, కవిత, గీతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.