మద్రాస్ :జూన్ 27
భర్త సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకు సమాన వాటా ఉంటుందని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. కుటుంబంలో భార్య క్రియాశీలకంగా వ్యవహరిస్తూ బాధ్యతల్ని చక్కబెట్టడం వల్లనే భర్త స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొంది. ఆ కారణంగానే భర్త తగినంత సంపాదించడానికి వీలవుతోందని, అందువల్ల భర్త సంపాదించిన ఆస్తిలో భార్య సమాన హక్కుదారు అని స్పష్టం చేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ రామస్వామి ఇటీవల తీర్పు వెలువరించారు. మృతి చెందిన తన భర్త పేరిట ఉన్న ఆస్తిలో సమాన వాటా ఇప్పించాలంటూ అమ్మాళ్ అనే గృహిణి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు చెప్పారు. ‘‘భార్య పిల్లలకు జన్మనివ్వడంతో పాటు వారిని పెంచుతుంది. ఇంటిని చూసుకుంటుంది. తద్వారా భర్త తన బాధ్యతలు తను సక్రమంగా చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఆమె ఇంటి పనిమినిషిలా, వంట మనిషిలా, మేనేజర్‌లా, ఆర్థిక సలహాదారులా వ్యవహరించడం వల్లనే భర్త తగినంత సంపాదించుగలుగుతాడు. కానీ చివరకు భార్యకు తన స్వంతమని చెప్పుకోవడానికి ఏమీ వుండదు. అందువల్ల ఆ భర్త సంపాదనతో వచ్చిన ఆస్తిని సమానంగా పంచుకోవడానికి ఆమె అర్హురాలే’’ అని పేర్కొన్నారు…