విధాత: వివాహాలు దైవ నిర్ణయాలంటారు. అన్నీ చూసి చేసుకున్న పెళ్ళిళ్ళు ఒకప్పుడు సంగతి ఏమోగానీ, నేటి కాలంలో పెటాకులు కావడానికి పెద్దగా సమయం తీసుకోవడంలేదు. అలాగే ఇద్దరు కలిసి బ్రతకాలనుకుంటే దానికి పెద్దలు గీసే హద్దులూ ఉండటం లేదు. ఇద్దరూ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఉంటే చాలు. మరేదీ అడ్డంకి కాదని నిరూపించిన జీవితాలు ఎన్నో చూస్తున్నాం. సామాన్యుల సంగతి ఏముంది కానీ సెలబ్రెటీల జీవితాలైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారంటే అది కూసింత వైరలే అవుతుంది.
ఈమధ్య కాలంలో జరిగిన భూమా మౌనిక, మనోజ్‌ల వివాహం సంగతికి వస్తే ఇద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారని అంతా అనుకున్నారు. వాళ్ళ పెళ్ళి వార్త చాలా కాలం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి విడిపోయి ఇద్దరూ పెళ్ళి చేసుకోవడం, దానికి తోడు మౌనికకు ఓ బిడ్డ ఉండటం కూడా చర్చనీయాంశం అయింది.
2016లో మౌనిక బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ వివాహానికి మనోజ్ కూడా హజరయ్యాడు. అయితే వాళ్ళ ఇద్దరి మధ్యా మనస్పర్థల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. తల్లిగా బిడ్డ ధైరవ్ రెడ్డి బాధ్యతను మౌనికే వహిస్తుంది.
ఇటుపక్క మనోజ్ కూడా ప్రేమించి పెళ్ళిచేసుకుని భార్యతో సరిపడక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ మనసులు కలిసి.. కలిసి బ్రతకాలని అనుకున్నాకా.. అప్పటికే రెండు కుటుంబాలకు మధ్య ఉన్న స్నేహం కారణంగా మనోజ్, మౌనికల తమ నిర్ణయాన్ని తెలిపి పెళ్ళికి శ్రీకారం చుట్టారు. ఇక మౌనిక బిడ్డను కూడా మనోజ్ కన్న కొడుకులానే సాకుతున్నాడు. ధైరవ్ తనకు దేవుడు ఇచ్చిన బిడ్డని పలుమార్లు మీడియా ముందు కూడా చెప్పుకొచ్చాడు మనోజ్.
అయితే ఈ సందర్భంగా వాళ్ళ ఇద్దరి అనుబంధాన్ని తెలుపుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మనోజ్. ఆ వీడియోలో మనోజ్, ధైరవ్ పెట్ డాగ్‌తో సరదాగా ఆడుకుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే మనోజ్, మౌనిక రిలేషన్ షిప్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ధైరవ్ వారితోనే ఉన్నాడట. అందుకే ధైరవ్ని మనోజ్ సొంత బిడ్డలానే సాకుతున్నాడని.. ఈ వీడియో చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.
మనోజ్ విషయానికి వస్తే.. కొంత కాలంగా ఎలాంటి సినిమాలూ చేయడం లేదు. సినిమాలకు గ్యాప్ వచ్చి దాదాపు ఐదేళ్ళు అవుతుంది. పెళ్ళి తరవాత తన సెకండ్ ఇన్నింగ్స్‌కి రెడీ అవుతున్నట్లుగా ఈ మధ్య హింట్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ‘వాట్ ది ఫిష్’ అంటూ ఓ సినిమా షూటింగ్ సాగుతుంది. ఈ సినిమానే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్లు మనోజ్ తెలిపారు. చూడాలి మనోజ్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.