అదిరిపోయే రాజకీయ నేపథ్యం అతని కేరాఫ్ అడ్రస్
చిరునవ్వే అతని ఆయుధం – అందరికీ ఆత్మీయుడే
తండ్రి సర్పంచ్.. ఆయన అడుగుజాడల్లో అతను సర్పంచ్
మున్సిపల్ చైర్మన్ గా షాద్ నగర్ కు ఎన్నో సేవలు..
నాటి నుండి నేటి వరకు ప్రజాసేవలో “విశ్వం” కుటుంబం
జగమంత కుటుంబం నాది అంటూ రాజకీయరంగంలో ఎదురులేని నేతగా అజాత శత్రువుగా ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ “మైహూనా” అంటూ అందరి కష్టసుఖాల్లో ఒక్కడిగా షాద్ నగర్ నియోజకవర్గంలో “మాస్ మహారాజగా” తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అగ్గనూరు విశ్వం. ఆయన గురించి పరిచయం అక్కర్లేని వ్యక్తి అతను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఆయన ద్వారా నేర్చుకోవచ్చు. అందరితో కలివిడిగా ఉంటూ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా జనం మెచ్చిన “విశ్వమన్న”గా అందరి హృదయాలను దోచుకున్న నాయకుడు విశ్వం. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఎంతోమంది ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ కొందరు తెరచాటుగానే అలా ఉండిపోతారు. పేరు పెద్దదైన, హోదా పెద్దదైన, ఎంత పవర్ ఉన్నా లేకపోయినా.. ఒకే విధంగా అందరిని పలకరిస్తూ ఏనాడు ఆడంబరాలకు వెళ్లకుండా అందరి తలలో నాలుకలా ఉన్న వ్యక్తి అగ్గనూరు విశ్వం.
ఇది రాజకీయ నేపథ్యం
షాద్ నగర్ పట్టణానికి చెందిన అగ్గనూర్ విశ్వం రాజకీయ దురంధరుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కలగక మానదు. తన తండ్రి అగ్గనూరు రాచప్ప గురించి తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఎవరు ఉండరు. దాదాపు 30 సంవత్సరాల పాటు షాద్ నగర్ ప్రాంతాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏలిన “మహా మాస్ లీడర్”. ఆయన కడుపున పుట్టిన రాజకీయ వారసుడు విశ్వం. రాజకీయాల్లో అగ్గనూరు రాచప్ప కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. సర్పంచ్ గా వీరి కుటుంబ ప్రస్థానం ప్రత్యేకమని చెప్పవచ్చు. తండ్రి దాదాపు 30 సంవత్సరాల పాటు సర్పంచ్ గా ప్రజలకు సేవలు అందిస్తే ఆయన ఆశయాల అడుగుజాడల్లో నడిచిన విశ్వం ఒకసారి సర్పంచ్ గా అదేవిధంగా రెండుసార్లు ఎంపీటీసీగా, మరోసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అంతేకాదు ఆయన ఆశయాలను పునికిపుచ్చుకున్న విశ్వం సతీమణి విశాల విశ్వం సైతం రాజకీయాల్లో నేను సైతం అన్నట్టు ఆమె కూడా ఒకసారి సర్పంచ్ గా సేవలు అందించారు. అంతేకాదు ప్రస్తుతం విశాలా విశ్వం కౌన్సిలర్ గా కూడా సేవలు అందిస్తూ వస్తున్నారు.
గోడలకు పోస్టర్లు అంటించి..
అగ్గనూరు విశ్వం రాజకీయాల్లో తనకంటూ ఒక పరపతిని సంపాదించడానికి ఆయన ఆషామాషీగా రాజకీయాల్లోకి పైకి రాలేదు. తండ్రి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఓ సామాన్య కార్యకర్తగా ఎదుగుతూ వచ్చారు. గోడలకు పోస్టర్లు అంటిస్తూ రాజకీయాల్లో ఓ చిన్న కార్యకర్తగా కూడా ఆయన పనిచేశారు.
1987- 88 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విశ్వం సామాన్య కార్యకర్త నుండి మున్సిపల్ చైర్మన్ వరకు ఎదిగారు. ఆనాటి నుండి నేటి వరకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తో పాటు ఆనాటి మాజీమంత్రి డాక్టర్ పి శంకర్ రావు, ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య లాంటి వారు ఎందరో ఆయనకు సుపరిచితులు. అంతేకాదు రాయికల్ దామోదర్ రెడ్డి, బక్కని నరసింహులు లాంటి రాజకీయ దురంధరులు కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటారు.. కానీ ఏనాడు విశ్వం తన రాజకీయ ఆజమాయిషిని చెలాయించలేదు.
విశ్వం దాదా..
విశ్వం ఎంత రాజకీయ పరిణితి చెందినప్పటికీ చిన్నవాళ్లలో చిన్నవాడిగా, పెద్దవాడిలో పెద్దవాడిగా అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఉరవడిని సంతరించుకున్నారు. విశ్వం ముందుంటే ఆయన చుట్టూ అందరూ సరదాగా ఉంటారు. ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలివిడిగా ఉంటారు.
ఇంగ్లీష్ – వింగ్లీష్…
అగ్గనూరు విశ్వం గురించి సరదాగా చెప్పుకోవాలంటే ఆయన మాట్లాడే ఇంగ్లీష్ తీరు అందరికి నవ్వు తెప్పిస్తుంది. సరదాగా అతను మాట్లాడే ఇంగ్లీష్ వింటే ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుతారు. తాజాగా అగ్గనూరు విశ్వం ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓ సభ అనంతరం సరదాగా మాట్లాడుతున్న సమయంలో విశ్వం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వదిలారు. దీనికి పగలబడి నవ్విన ఎమ్మెల్యే అంజయ్య.. సరదాగా ఆయన ఇంగ్లీష్ భాషను చూసి కాసేపు నవ్వుకున్నారు. అక్కడే ఉన్న మరో జర్నలిస్టు “శంకర్ దాదా ఎంబిబిఎస్” అనేసరికి ఎమ్మెల్యే ఇది నిజం అంటూ సరదాగా విశ్వం భుజంపై చేయి వేసి నవ్వారు. ఒక వ్యక్తి అందరిలో కలివిడిగా ఉంటూ సరదాగా ఇతరులను నవ్వుతూ నవ్విస్తూ ఉండడం కన్నా గొప్ప విషయం మరొకటి ఏముంటుంది. విశ్వం గురించి సరిగ్గా అదే అంచనా వేయవచ్చు. ఎదుటివారిని నవ్వించడం, సరైన సమయంలో వారిని ఆదుకోవడం, ముఖ్యంగా పట్టణంలో “మాస్ మహారాజగా” పేరుపొంది రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా నేటికీ అందరి మన్నలను పొందుతున్న విశ్వం గురించి ఇలా అక్షర రూపంలో హలో షాద్ నగర్ ద్వారా చెప్పక తప్పదు..