గద్దర్ కొత్త పార్టీ
పెట్టబోతున్నారా❓️
హైదరాబాద్ :జూన్ 21 , గద్దర్ తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. గత కొద్దీ రోజులుగా గద్దర్ ఏ పార్టీ లో చేరుతారనే చర్చ కొనసాగుతుండగా..గద్దర్ మాత్రం ఓ పార్టీ లోకి వెళ్లడం కంటే తానే కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి గద్దర్ అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా, గద్దర్ సతీమణి నాగలక్ష్మి కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు. మూడు రంగులతో ఉండే పార్టీ జెండాలో పిడికిలి గుర్తు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయి గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు. బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. పాటలతో ఉద్యమాన్ని రగిలించారు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు.
గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది…..