‘ఫిష్-ఆంధ్ర’ అవుట్ లెట్లతో జీవనోపాధి
గొల్లపూడిలో ‘ఫిష్ ఆంధ్ర’ యూనిట్ ప్రారంభం.
ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 21.6.2023
నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ‘ఫిష్-ఆంధ్ర’ బ్రాండ్ పేరుతో అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్ లెట్ ను శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు బుధవారం ప్రారంభించారు. దీని మొత్తం విలువ రూ.20 లక్షలు కాగా, ప్రభుత్వం నుంచి 60 శాతం సబ్సిడీ మంజూరైంది. సబ్సిడీ రూ.12 లక్షలు పోనూ రూ.8 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ‘ఫిష్-ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పెంచే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, యూనిట్స్, కియోస్క్‌ల ద్వారా విక్రయాలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఎంతోమందికి ఉపాధి కలిగించే దిశగా వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలా భరోసా ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతూ ప్రజలకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్ లెట్లు పరిశుభ్రత, నాణ్యత, సరైన విలువకు చిరునామగా నిలుస్తున్నాయన్నారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.