రచ్చబండలే ప్రచారాస్రాలుగా రాయలసీమ కర్తవ్యదీక్ష ప్రచారం
ఈ నెల 24 న కర్నూలు ఎస్ టి బి సి కళాశాల మైదానంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీక్ష
స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 22, నంద్యాల
తరతరాలుగా మోసపోతున్న రాయలసీమకు సమన్యాయం జరగాలంటే, నీళ్లు, నిధులు, నియమాకాల్లో సమాన వాట కావాలంటూ రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 24 న కర్నూలు ఎస్టిబిసి కళాశాల మైదానంలో రాయలసీమ కర్తవ్య దీక్ష జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డి, సి. ప్రతాప్ రెడ్డిలు వివరించారు.వారం రోజులుగా గ్రామాల్లోని రచ్చబండల వద్ద బ్యానర్ కట్టి రాయలసీమ పాటలతో ప్రజలను చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులనుద్దేశించి వారు మాట్లాడుతూ వెనుకబాటు తనం పేరుతో నిత్యం రాయలసీమకు అన్యాయం చేస్తూ కొందరికి రాజకీయ పదవులు మినహా అన్ని రంగాల్లో రాయలసీమకు సమానవాటా లేకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు . బ్రిటిష్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు రాయలసీమలోని కొంత భూమి కి సాగునీరు అందుతుంది. ఆనాటి బ్రిటిష్ పాలకులు రాయలసీమ కరువును చూసి వాటి పరిష్కారంగా 1920 లోనే కర్నూలు – కడప ప్రధాన కాలువ (కె సి కెనాల్ ) 1943-1948 లో తుంగభద్ర డ్యామ్, హెచ్ఎల్ సి, ఎల్ ఎల్ సి నిర్మాణం జరిగి కొంతమేరా ఆయకట్టుకు హక్కుగా సాగునీరు అందుతోంది. దేశానికి స్వాత్రంత్ర వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న కూడా రాయలసీమలో చేపట్టిన ఏ ప్రాజెక్టు పూర్తి కాదు, వాటి ద్వారా అరకొర నీరే అందుతోంందన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టా ఆయకట్టు కోసం మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు ఉపయోగపడుతోందన్నారు.జీవో నెంబర్ 69 తో శ్రీశైలం ప్రాజెక్టులో దిగువకు నీరు తోడేస్తూ రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందకుండా చేస్తూ పాలకులే రాయలసీమ కరువు, వలసలకు కారణం అవుతూ మరణశాసనం రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అధికార, ప్రతిపక్షాలు పట్టీసీమ, పోలవరం అంటూ కృష్ణా డెల్టా ఆయకట్టు పరిరక్షణకు పాటుపడుతూ అందులో ఒక శాతం కూడా రాయలసీమ ప్రాజెక్టుల పురోగతిగాని, ఆయకట్టు పరిరక్షణకు కృషి చేయకపోవడం అన్యాయం అన్నారు.దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోకసభ స్వీకర్, గవర్నర్లు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, అన్ని ప్రధాన పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు అందించిన రాయలసీమకు మాత్రం నిధులు సమానవాటా అందించడంలో విఫలం అయ్యారని విమర్సించారు.రాయలసీమ నాల్గవజోన్ లో ఉన్నా నియామాకాల్లో మాత్రం ఓపెన్ జోన్ గానే ఉంది. జోనల్ నిబంధనలు తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కర్ణాటక ప్రభుత్వం ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మిస్తూ రాయలసీమ ప్రాజెక్టులకు చుక్కనీరు దిగువకు రాకుండా చేస్తూ మరణశాసనం రాస్తున్నా పాలకులు, ప్రతిపక్షాలు నోరు మెదపరని, కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 167K జాతీయ రహదారి మంజూరు చేసి సప్తనది సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై సుమారు రూ.1200 కోట్లతో అందమైన తీగల వంతెన మంజూరు చేస్తే అయ్యా ఈ తీగల వంతెన (ఐ కానిక్ బ్రిడ్జి ) వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదు, కరువు, వలసలు ఆపలేవు, తీగల బ్రిడ్జి బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మిస్తే సంగమేశ్వరం వద్ద సుమారు 70 TMC ల నీరు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అంది కరువు, వలసలు నివారణకు ఉపయోగపడుతుందని ఆందోళన రూపంలో మొరపెట్టుకుంటున్నా అటు పాలకుల్లో గాని ఇటు ప్రతి పక్షాల్లో గాని కనీస స్పందన లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.100 ఏళ్లయినా రాయలసీమ సమాజం ఇప్పటికి నయవంచనకు గురి అవుతూనే ఉంది. ఈ మోసాలకు తెరధించాల్చిన సమయం ఆసన్నమైందని, ఇన్నాళ్లు కోల్పోయిన నీళ్లు, నిధులు, నియమాలకోసం రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమిద్దామని, ఈ నెల 24 వ తేది కర్నూలు ఎస్ టి బి సి కళాశాల మైదానంలో జరిగే రాయలసీమ కర్తవ్యదీక్షలో అందరం పాల్గొని విజయవంతం చేయాలని అంటూ గ్రామ రచ్చబండల వద్ద, ఉపాధి హామీకూలీల వద్ద కే వెళ్లి వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాం అన్నారు.