అలిపిరి కాలినడక భక్తులకు అలిపిరి బస్టాండ్ వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు
*శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో ఎస్.ఎస్.డి టోకెన్లు*
తిరుమల, : తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనానికి టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందొచ్చు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైం స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
కాగా వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైం స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.