వికారాబాద్:చదువు ఒక్కటే కాకుండా విద్యార్థులు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లాంటి అన్ని రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని, మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూసి అనవసర విషయాల పట్ల పక్కదారి పట్టకూడదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం వికారాబాద్ పట్టణంలోని సెంట్ ఆంథోనీ హైస్కూల్లో నిర్వహించిన స్టూడెంట్ అవార్డు సెరిమని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చైర్ పర్సన్ మంజుల రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎంతో కీలకమైన ఉన్నత తరగతులు చదివే రోజుల్లో మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూసి అనవసర విషయాల పట్ల పక్కదారి పట్టకుండా, సమయం దొరికినప్పుడు క్లాస్ పుస్తకాలే కాకుండా జ్ఞానాన్ని అందించే ఇతర బుక్స్ కూడా చదువుతూ మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ప్రకృతిని కాపాడడం, మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా మన అందరి బాధ్యత అని చైర్ పర్సన్ గుర్తు చేశారు. ముఖ్యంగా ర్యాంకుల వెంట పరిగెత్తకుండా విద్యార్థులకు కావలసిన నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సురేష్ , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ , పాఠశాల వ్యవస్థాపకులు లూయిస్ , ప్రిన్సిపల్ అర్చన , నాగయ్య , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.