వికారాబాద్ : తల్లిదండ్రుల తలన పిల్లలపై రుద్ది వారి జీవితాలను బలి చేయవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోటపల్లి మండల పరిధిలోని క్వాంటం లైఫ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కొండవీటి న్యూటన్, డాక్టర్ కొండవీటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర శిశువు, ఆధ్యాత్మిక రెసిడెన్షియల్ ప్రోగ్రాం కు వికారాబాద్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి జీవితంలో తన అంతరాత్మ చెప్పింది అనుసరించి నడుచుకోవాలని అన్నారు. తనకు తెలిసినా ఇతరులు చెప్పేంతవరకు కూడా గ్రహించలేని పరిస్థితిలో నడుచుకుంటూ కష్టాల పాలవుతున్నామని అన్నారు. జీవితంలో తాను సాధించలేని గోల్స్ ను పిల్లలపై రుద్ది వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకోకుండా బలవంతంగా పిల్లలకు ఇష్టం లేని కోర్సులలో చేర్పించి జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. మనిషికి ఆశ ఉండాలని అత్యాశ పనికిరాదని అన్నారు. జీవితంలో సమయస్ఫూర్తితో పాటు లౌక్యం ఉండాలని అన్నారు. యువత రాజకీయంలోకి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏ స్కూల్లో విద్యార్థులను అడిగిన టీచర్ ను, డాక్టర్ అవుతా అంటున్నారని నాయకుడిని అవుతానని అనటం లేదని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చే బాధ్యత యువతపై ఉన్నదని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలపై కుల మతాల విభేదాలు కుండా పెంచాలని ప్రతి మతాన్ని గౌరవించే విధంగా పిల్లల పెంపకం ఉండాలని అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు వ్యవహరించే ప్రతి అంశాన్ని గమనిస్తారని 75శాతం తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారని చెప్పారు. క్వాంటం లైఫ్ యూనివర్సిటీలో ఐదు రోజుల ఆధ్యాత్మిక, శారీరక మానసిక అనారోగ్యాలకు మూల కారణాలు తెలిపి శిక్షణ శిబిరంలో ఆరోగ్యం ఆత్మవిశ్వాసం, ఆనందం నింపి లక్షల మంది జీవితాలను ప్రభావితం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.