సాత్విక్ కుటుంబానికి అండగా ఉంటాం
బాధితులను పరామర్శించిన “వీర్లపల్లి శంకర్”
కర్కశ కార్పొరేట్ విద్యా సంస్థలను వదలబోమని శంకర్ హెచ్చరిక
షాద్నగర్: విద్యార్థుల పట్ల కర్కషత్వంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు వాటికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వ తీరును ఎండగడతామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. గురువారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ కుటుంబ సభ్యులను షాద్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో గల వారి గృహంలో కలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. చదువుకునే పిల్లల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నిర్వాహకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆ కళాశాల అనుమతులు రద్దు చేయాల్సిందేనని అన్నారు. సాత్విక్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని, న్యాయం కోసం ఎంతకైనా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సాత్విక్ లేని లోటు తల్లిదండ్రులకు తీర్చలేనిదని ఈ ప్రపంచంలో పుత్రశోకం ఎంతో చెడ్డదని అన్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వయసులో ఇలా పుత్రుడు దూరం కావడం బాధాకరమని ఆవేదన చెందారు. సాత్విక్ కేసు విషయంలో ఎలాంటి న్యాయ సహకారం అందించాలన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ తో పాటు నందిగామ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, యూత్ కాంగ్రెస్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్, సుదర్శన్, అందే శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..