యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గుట్ట కింద నుంచి నేరుగా కొండపైకి భక్తులు వెళ్లేలా ఐదు లిఫ్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొండకు ఉత్తరం వైపు ఘాట్ రోడ్డు వద్ద వరుసగా ఐదు లిఫ్టులను నిర్మించనున్నారు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి 25 నుంచి 35 మంది వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. లిఫ్టుల నుంచి పైకి వెళ్లిన తర్వాత.. నేరుగా క్యూ కాంప్లెక్స్‌కు ప్రత్యేకంగా కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. కారిడార్ మీదుగా క్యూ కాంప్లెక్స్, ఆలయం వరకు చేరుకోవచ్చు. అటు నుంచి డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్లవచ్చు. లిప్టుల ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం విజయవాడ దుర్గమ్మ ఆలయం, అన్నవరం గుడిలో ఈ తరహా లిఫ్టులు ఉన్నాయి. లిఫ్టులు అందుబాటులోకి వస్తే సాధారణ భక్తులతోపాటు దివ్యాంగులు, వృద్ధులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
రూ.25 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
గుట్ట కింద ఉత్తర భాగంలో ఐదు లిఫ్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇందుకు రూ.25 కోట్ల దాకా అవసరం. లిఫ్టుల నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు కారిడార్ ఉంటుంది. అక్కడి నుంచి క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి చేరుకోవచ్చు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే తదుపరి పనులు ప్రారంభిస్తాం.