మంచం కోసం ఆలుమగల మధ్య ఫైటింగ్.. పోలీసులకు ఫిర్యాదు
కట్నం కోసమో, బంగారు ఆభరణాల కోసమో, లేదంటే కుటుంబ విషయాల్లో ఆలుమగల మధ్య గొడవలు చోటు చేసుకోవడం చూశాం. కానీ ఈ దంపతుల మధ్య మాత్రం మంచం విషయంలో గొడవ జరిగింది. మంచం ఇచ్చేందుకు నిరాకరించిన భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బొరివ్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బొరివ్లి ఏరియా రాంబాగ్ లేన్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఓ ఇద్దరు దంపతులు ఉంటున్నారు. ఆ జంటకు కొన్నేండ్ల క్రితం వివాహం కాగా, రెండేండ్ల నుంచి వారి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విడాకులు ఇవ్వాలని 2022, ఏప్రిల్‌లో భర్తను భార్య కోరింది. కానీ అందుకు భర్త అంగీకరించలేదు. అయితే ఒకే ఇంట్లో ఉంటూ.. వస్తువులను పంచుకున్నారు. ఒకరు ఒక సమయంలో వినియోగించిన వస్తువును మరొకరు వినియోగించరాదనే కండీషన్ పెట్టుకున్నారు. శనివారం రాత్రి భార్య మంచంపై నిద్రిస్తుంది. రాత్రి ఒంటి గంట సమయంలో భర్త మంచం వద్దకు వచ్చాడు. తాను విశ్రాంతి తీసుకోవాలి. మంచం ఇవ్వాలని భార్యను డిమాండ్ చేశాడు. ఆమె మంచం ఇవ్వకపోవడంతో.. చెవిపై తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి, వినికిడి కోల్పోయింది.దీంతో తన స్నేహితురాలి సాయంతో బాధితురాలు బొరివ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెవి పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు నిర్ధారించారు.