తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అలర్ట్. ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది.
శారీరక సామర్థ్య పరీక్షలు మొదలుపెట్టిన నాటి నుంచి 25 రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేయాలనే సంకల్పంతో TSLPRB కసరత్తు చేస్తోంది. వీటిని పూర్తి చేస్తే ఇక మిగిలి ఉండే మెయిన్స్ రాత పరీక్ష నిర్వహణ సులువేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలను ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై TSLPRB దృష్టి సారించింది. గతంలో అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగాలకు ఒకసారి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరోసారి ఈవెంట్స్ కు హాజరు కావలసి ఉండేది. దీంతో అభ్యర్థులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ రూల్ ను మార్చారు. ఎన్ని పోస్టులకు అప్లై చేసిన ఒకేసారి అర్హత సాధిస్తే సరిపోయేలా నిబంధనలను సడలించారు. ఇది అభ్యర్థులకు ఉపయోగపడనుంది.
శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాలు ఇవే:
హైదరాబాద్-ఎస్ఏఆర్ సిపిఎల్ అంబర్ పేట
సైబరాబాద్-8వ బెటాలియన్ కొండాపూర్
రాచకొండ-సరూర్ నగర్ స్టేడియం
సంగారెడ్డి-పోలీస్ పరేడ్ గ్రౌండ్
సిద్దిపేట-పోలీస్ పరేడ్ గ్రౌండ్
కరీంనగర్-సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం
అదిలాబాద్-పోలీస్ పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్-రాజారాం స్టేడియం నాగారం
మహబూబ్ నగర్-డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్
వరంగల్-హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం
ఖమ్మం-పోలీస్ పరేడ్ గ్రౌండ్
నల్గొండ-మేకల అభినవ్ స్టేడియం