ధరణి పోర్టల్ ను రద్దు చేసి భూములను కాపాడాలని టీపీసీసీ కార్యదర్శిలు జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి, చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల తహశీల్దార్ కార్యాలయం ముందు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టి డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ… రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడానికి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ధరణితో భూ సమస్యలకు పరిష్కారం దక్కకపోగా కొత్త సమస్యలు తలెత్తడంతో రైతులు అవస్థలు పడుతున్నారాని, ధరణి రద్దు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ధరణీ వెబ్సైట్ పేరుతో భూ రికార్డులను నిర్వహించే భాధ్యత ఒక విదేశీ కంపెనీకి అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు భూమి రికార్డుల నిర్వహన పూర్తిగా సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ లాండ్ అడ్మినిస్టేషన్) అధీనంలో ఉండేవని, ఇప్పుడు కూడా పూర్వం విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిని పూర్తిగా రద్దు చేయాలని, నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంటని జాబితా నుంచి తొలగించి గ్రామ పంచాయతీ సభలో ఆయా గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు. అటవీ భూములు 2006 లో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలని, కాంగ్రెస్ హాయాంలో పేదలకు అసైన్డ్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాధారులకు ఉండే హక్కుకు సమానంగా అసైన్ భూములకు కూడా హక్కు కల్పించాలన్నారు. ప్రతి ఏటా రెండు పంట కాలాలకు భూములు కౌలు చేసుకునే రైతులకు హక్కు కలిగించే విధంగా గ్రామ స్థాయిలో కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకొచ్చి పట్టా భూమి యజమానికి ఏ విధమైన చట్ట పరమైన ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. 2004 లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పాలసీని అమలు చేయడానికి ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి రాష్ట్ర శాసన సభలో వెంటనే భూమి టైటిల్ గారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు,డీసీసీ ప్రధాన కార్యదర్శిలు పెంట్టయ్య గౌడ్, మహేశ్వర్ రెడ్డి,పార్టీ ఉపాధ్యక్షులు పాండు, మల్లేష్, సత్యం, నాయకులు మాజీ సర్పంచ్ లు గోపాల్ రెడ్డి, నర్సింలు, కృష్ణాగౌడ్, బాలయ్యా, హనీఫ్, శేఖర్ రెడ్డి, రాములు, ch ప్రభాకర్, ప్రభాకర్ గౌడ్ , శివ, తదితరులు పాల్గొన్నారు.