ఆక్రమణలోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి
భూమి లేని పేదలకు పంచండి- సిపిఐ
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 22, మహానంది:
మహానంది మండలంలోని పలు గ్రామాలలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకొని అర్హులైన నిరుపేద ప్రజలకు ఇవ్వాలని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక మండల కార్యాలయంలో తాసిల్దార్ జనార్దన్ శెట్టికి డిమాండ్ తో కూడిన వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో భూ అక్రమణదారుల పెత్తందారుల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని తమ సొంత భూముల లాగా వాడుకుంటున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. మండలంలోని బుక్కాపురం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 26/1, 30, 89, 93/1 లో ఉన్న 6 ఎకరముల 70 సెంట్ల భూములను గ్రామపెత్తందారులు ఆక్రమించు కున్నారని గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో గుర్తించిన ప్రభుత్వ భూములను ఎర్రజెండా పాతి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలంలో పంచుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్.సామేలు, సిపిఐ మండల కార్యదర్శి పి. వీరప్ప, రైతు సంఘం కార్యదర్శి గురుమూర్తి పాల్గొన్నారు.