మద్యం సేవించి వాహనం నడిపే వారికి భారీ మూల్యం చెల్లించక తప్పదు..!
— ఎస్సై శివప్రసాద్.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మండలంలోని పలు ప్రధాన కూడళ్లో తన సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వాహనదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి స్థానిక సివిల్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి దీప దైవ కృప ఒక్కొక్కరికి 10 వేల 500 రూపాయలు చొప్పున భారీ జరిమానా విధించినట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. ఇకనుండి మండలంలోని ప్రధాన కూడళ్ళు అయిన కొత్తూరు సెంటర్, జొన్నాడ, చెముడులంక, మడికి, నర్సిపూడి గ్రామాల్లో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, వాహనాలు నడుపుతున్నప్పుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయితే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.