చౌటుప్పల్: బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఎస్టీల రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ తన పార్టీ పేరును మార్చేశాడన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడు ప్రజలు చైతన్య వంతులని, ఆనాటి రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర నల్లగొండ జిల్లాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి పోరాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని కొనియాడారు. ఉద్యమంతో తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందన.. కుటుంబ పాలన పోయి ప్రజల పాలన రావాలనే మునుగోడు ఎన్నికలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ గద్దె మీద కూర్చున్నాడని విమర్శించారు. 8 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు మునుగోడు గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చిందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నవంబర్ 3 తర్వాత కేసీఆర్, ఆయన కొడుకు ఎవరికీ కనబడరని, కలవరని చెప్పారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్‌లు దత్తత తీసుకోవాలని, సీఎం కార్యాలయానికి వచ్చే సీఎం కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.