30న రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం.. వేడుకలా చేద్దాం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాల అభివృద్ధి కోసం తొలి విడతగా కేంద్రం రూ.15.4 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో కర్నూలు, కడప, నెల్లిమర్ల, చిత్తూరులో రెండు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండ, కదిరి, పలాస, విశాఖపట్నంలో నగరవనాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

అటవీ శాఖ అధికారులతో శనివారం పవన్‌ కల్యాణ్‌ చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 నగర వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 50శాతం మేరకు ఉండాలని, ఇందులో భాగంగా నగర వనాలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇందులో యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక వేడుకలా చేయాలని, ప్రభుత్వ శాఖలతోపాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, పేపర్ మిల్లులు, అధ్యాత్మిక సంస్థలు.. అన్నింటినీ ఇందులో పాలుపంచుకొనేలా చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!