నార్సింగి : మండల పరిధిలోని పెద్ద తాండా లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట రెండవ రోజు కార్యక్రమాన్ని శుక్రవారం నార్సింగి తహశీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో నిర్వహించారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా షేక్ కరీం తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లేశం, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడి ఈడు కలిగిన పిల్లల తల్లి దండ్రుల తో కలిసి వారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్పే ఉపాధ్యాయులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉంటారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షలలో ఉత్తీర్ణులైన, మేధావులు అయిన ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించి విద్యా బోధన చేయిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తారని అన్నారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారాన్నారు. పిల్లల తల్లి దండ్రులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచన చేయాలని, తమ పిల్లల బంగారు భవిత కొరకు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలు చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.