చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో భాజపా అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అతెళ్లి అనంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భాజపా కార్యకర్తలందరి సమిష్టి కృషితో చేవెళ్ల పార్లమెంటు స్థానంలో భారీ మెజార్టీ సాధించగలిగామన్నారు. బుధవారం చేవెళ్లలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భాజపా విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ చరిష్మా వల్లే తెలంగాణలో అత్యధిక స్థానాలు భాజపా గెలుచుకోగలిగిందన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. భాజపాపై ఎంతోమంది అసత్యపు ప్రచారాలు చేసినప్పటికీ.. ప్రజలంతా వాటిని నమ్మలేదని.. ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థం అవుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భాజపాకు మద్దతుగా నిలిచారని చెప్పారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వంతు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.