రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 21:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న రైతువేదిక లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ హాజరయ్యారు. ఆయన రామాయంపేట మండల పరిధిలోని పలు విత్తన మరియు ఎరువుల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ… వచ్చే వర్షాకాలంలో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచుతామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 3,73,509 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వీటికి సరిపడా విత్తనాలు ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు అగ్రో రైతు సేవ కేంద్రాలు ప్రైవేట్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నేల సంరక్షణ పద్ధతుల్ని పెంపొందించడానికి సబ్సిడీపై జీలుగా, జనుము విత్తనాలను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ వేసవికాలంలో కురుస్తున్నటువంటి వర్షాల ఉపయోగించుకొని వేసవి దుక్కులు చేసుకోవాలని రైతులు తొందరపడి ఈ వర్షానికి విత్తనాలు వేసుకోవద్దని భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని లేనిచో భూమి నుండి అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల విత్తన మొలకశాతంపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున భూమిలో కనీస తేమ ఉన్నప్పుడే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. అదేవిధంగా విత్తన దశ నుండి పంటకోత వరకు వివిధ అంశాలపై వ్యవసాయ మరియు విశ్వవిద్యాలయ నిపుణులచే ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై ఆధునిక సాంకేతికత అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ వానాకాలంలో విత్తన మరియు ఎరువుల కొనుగోలులో ఆదికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయ సంబంధ అంశాలపై తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ మరియు మండల వ్యవసాయ అధికారులు రాజ్ నారాయణ సతీష్ హరి ప్రసాద్ బాల్ రెడ్డి మరియు డివిజన్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.