హైదరాబాద్: సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
వీరిద్దరి అరెస్ట్‌తో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్యతోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతల అరెస్ట్‌ను బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది.
మల్లారెడ్డి వర్సెస్ 15 మంది..
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పోలీసులతో కూడా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వ్యక్తులు వాదనకు దిగారు.
ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకూ పోలీసులు సర్ది చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉండి ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తున్నారు..