నార్సింగి : మద్యానికి బానిసైన ఒంటరి మనిషి తన రూంలో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఘటన మండల కేంద్రం లో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి గ్రామానికి చెందిన వీరప్ప నారాయణ (50) తండ్రి రాజయ్య కు గతం లో ఘనపురం కు చెందిన లక్ష్మి తో వివాహం జరిగింది. ఆ దంపతులకు కూతురు రజిత జన్మించిన అనంతరం నారాయణ భార్య లక్ష్మి ఆరోగ్య కారణాలతో మృతి చెందింది. అనంతరం నారాయణ వెంకటరావు పేట్ కు చెందిన గంగవ్వను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టిన అనంతరం దాదాపు 25 సం క్రితం కుటుంబ కలహాల వల్ల గంగవ్వ నారాయణ ను వదిలి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న నారాయణ మద్యానికి అలవాటు పడి నార్సింగి లో ఉంటూ ఎక్కడో ఒక దగ్గర అన్న తింటూ, కాస్య తాండా చెరువు కట్ట పై కల రూంలో ఒంటరిగా ఉంటున్నాడు. పెళ్లి అయిన పెద్ద కూతురు రజిత వద్ద అప్పుడప్పుడు వెళ్లి కొద్ది రోజులు ఉండి వచ్చే వాడు. కూతురు వద్దకు వెళ్ళాడని నారాయణ అక్క ఈరప్ప సత్తవ్వ అనుకుంటున్న తరుణంలో 16 ఏప్రిల్ నాడు సాయంత్రం గ్రామస్తులు మీ తమ్ముడు రూంలో చనిపోయి ఉన్నాడని తెలిపారు. సత్తవ్వ కొద్ది మంది తో పాటు వెళ్లి చూడగా నారాయణ మృతి చెంది ఉన్నాడు. సత్తవ్వ వెంటనే విషయాన్ని పోలీసులకు తెలుపగా ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దిన్ సిబ్బంది తో వెళ్లి నారాయణ మృత దేహాని పరిశీలించగా, అతను చనిపోయి రెండు రోజులు కావచ్చని అంచనా వేశారు. అనంతరం మృత దేహాని పోస్టుమార్టం కోసం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. నారాయణ అనారోగ్య కారణాలతో మరణించాడని, తమకు అతని మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని సత్తవ్వ తెలిపారని, మృతుని అక్క సత్తవ్వ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దిన్ పేర్కొన్నారు.