గొట్టిముక్లలో శ్రీ సీతారాముల వారి కల్యాణం కమనీయం..
స్వామి వారికి పల్లకి సేవ…
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా గొట్టిముక్ల గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా కళ్యాణము బుధవారం ఆలయ అర్చకులు నిర్వహించారు. కళ్యాణంకు ముందు ఉదయం శ్రీ సీతారాముల, లక్ష్మణ హనుమంతుని విగ్రహాలతో ఆలయం నుంచి గ్రామమంతా పల్లకి సేవ నిర్వహించారు. భాజా భజంత్రీల, శ్రీరామ స్మరణతో గ్రామ పురవీధులు మారుమ్రోగాయి. పల్లకి సేవ అనంతరం స్వామివారిని శ్రీ సీతారామల ఆలయానికి తీసుకువచ్చి శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి సిద్ధం చేశారు. తరువాత శ్రీ సీతారాముల వంశ గోత్రాల ప్రవరలు చదివారు. శ్రీరాముడిది వశిష్ట గోత్రం సీతమ్మది గౌతమ గోత్రంగా చెప్పారు. స్వామివారికి సీతమ్మకి పెళ్లి తంతు నిర్వహించే అర్చక స్వాములు శ్రీరామునికి పాదప్రక్షాళన చేశారు. కన్య దానాన్ని పురస్కరించుకొని భూ, గోదానాలతో కూడిన మహా సంకల్ప క్రతువులు నిర్వహించారు.11 గంటలకు ఆలయ అర్చకులు వధూవరులైన సీతారాముల ఉత్సవ మూర్తుల శిరస్సులపై జిలకర్ర బెల్లం పెట్టించి సితమ్మకు మాంగల్య ధారణ జరిగింది. తర్వాత ఉంచిన తలంబ్రాలను సీతారాములపై పోశారు. శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా చూసేందుకు గ్రామంలోని ప్రజలందరూ తరలివచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూసి తరిస్తే పాపాలు తొలగి సకల సంపదలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, భక్తులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు.