ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవము..
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవము..
హైదరాబాద్ ఏప్రిల్ 11 స్టూడియో టీవీ 10 ప్రతినిధి:
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలో గల తపస్వి ఫౌండేషన్ అనాధ శరణాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్స్, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ” సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మరియు సంఘ సేవకుడు అయిన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప మహనీయుడన్నారు. సమాజంలో తరతరాలుగా అణగారిన వర్గాల సర్వతోముఖాభి వృద్ధికై ‘సత్యశోధక్ సమాజ్’ ను ఏర్పాటు చేసి ఈ వర్గాల అభ్యున్నతికోసం కృషి చేసిన గొప్ప మానవతా వాది. మానవుడు సర్వతోముఖాభి వృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమని భావించి శూద్రులకు, అతిశూద్రులకు ముఖ్యంగా మహిళల అక్షరాస్యతకై విశేషమైన కృషి చేశారు. తన భార్య అయిన సావిత్రి బాయి పూలేకు విద్య నేర్పించి తదనంతరం ఉపాధ్యాయ శిక్షణనిప్పించి 1848లో మహిళలకు తొలి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారు. అలా సావిత్రిబాయి పూలే మనదేశంలో తొలి మహిళా ఉపాధ్యారాలు అయ్యారు. తదనంతరం దాదాపుగా మరో 52 పాఠశాలలు ఏర్పాటు చేశారు. పూలేకు చిన్నతనంనుండే ఛత్రపతి శివాజీ, జార్జ్ వాషింగ్టన్ ల జీవితాలు ప్రభావితం చేశాయి. థామస్ రచించిన మానవహక్కుల పుస్తకం అతని ఆలోచనలను పదునెక్కించాయి. మహాత్మా పూలే రచయితగా, సంపాదకుడిగా ఈ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, అంటరాని తనానికి వ్యతిరేకంగా చైతన్యం కలిగించారు. అతను బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే వితంతువులయిన మహిళలకు పునర్వివాహాలకై ప్రజలలో చైతన్యం కలిగించారు. అనాధలకు మరియు వితంతు మహిళలకు అనేక శరణాలయాలు ఏర్పాటు చేసి, గర్భవతులైన వితంతు మహిళలకు పురుడులు పోయించి వారికి ఒక నీడ కల్పించారు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడైన లొంఖాండేతో కలిసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు కృషి చేశారు. జ్యోతిరావు పూలే దంపతులు తరతరాలుగా అణగారిన వర్గాలు మహిళల సర్వతోముఖాభి వృద్ధికై జీవితాంతం కృషి చేసివటువంటి పుణ్య దంపతులని కొనియాడారు. నేటి యువత ఆ పుణ్య దంపతుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని మహిళా సాధికారతకు బహుజనుల ఎస్సి ఎస్టీ బీసీ , మైనారిటీలు) సర్వతోముఖాభి వృద్ధికి కృషి చేయడమే మనము వారికి అర్పించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు చందు. శాంతి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, శివరామకృష్ణ, ధర్మసాగర్ విద్యార్థులు పాల్గొన్నారు.