స్వామి వారి కృపతో వేయి పాటలు రాశాను:-మౌనశ్రీ మల్లిక్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 06, మహానంది:
ఆ మహానందిశ్వరుని కృప వల్లనే తాను టెలివిజన్ సీరియళ్లకు, సినిమాలకు కలిపి వేయి పాటలు రాయగలిగానని ప్రముఖ కవి, సినీగేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ పేర్కొన్నారు. మంగళవారం మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం మౌనశ్రీ మల్లిక్ స్వప్న దంపతులను వేద పండితులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వాదం అందించారు.తాను స్వామి వారి భక్తుడనని, తన కృప వల్లనే దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సంగీత దర్శకులు కీరవాణి, కోటి వంటి ప్రముఖులతో పనిచేయగలుగుతున్నానని అన్నారు.తనకు వీలు చిక్కిన ప్రతిసారి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఇక్కడ ఇక్కడి శిల్ప శోభిత, ప్రకృతి రమణీయత తను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఇది యోగులు నడయాడిన భూమి అన్నారు.సినీ,టీవీ రచయిత సాహిత్యప్రకాశ్ మాట్లాడుతూ తాను నంద్యాల జిల్లా వాస్తవ్యుడననీ తన ఇష్ట దైవం మహానందీశ్వరుడని స్వామివారిని ప్రస్తుతించారు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలను చూపించిన క్షేత్రం మహానంది అన్నారు. తన వివాహం కూడా స్వామివారి సన్నిధిలోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు.