షాద్‌నగర్ “బాద్ షా” ఎవరు..?

“కారు”ను ఢీ కొడతారా..?

2014 – 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం

2023 కాంగ్రెస్, బిజెపిలకు అచ్చోచ్చేనా..?

“హాలో షాద్ నగర్” 2023 ఎలక్షన్ రౌండప్..!

సిపిఎం, సిపిఐ, బీఎస్పి పార్టీల దారేటు..?

ఎన్నికల నగారా మ్రోగింది.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ ఎన్నికలపై ఆసక్తితో పాటు ఉత్కంఠ రేగుతోంది. కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న గులాబీ దండు తిరిగి అదే జోరును కొనసాగిస్తుందా? ఈ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందా? లేదా కాషాయ దళాలు షాద్ నగర్ అసెంబ్లీనీ కమ్మేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. 2023 శాసనసభ ఎన్నికల కోసం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి సిద్ధం కాగా ఈ మూడు పార్టీలను ఎలా ప్రభావితం చేయాలన్న ఆలోచనలో సిపిఎం, సిపిఐ, బీఎస్పి పార్టీలు ఆలోచనలో పడ్డాయి. 2014లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ఆ తర్వాత 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపించింది. అంతకుమించి అన్నట్టు టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడవసారి అంజయ్య తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోబోతున్నారు. అంజయ్య స్పీడుకు కాంగ్రెస్, బిజెపి, విపక్ష పార్టీలు కళ్లెం వేస్తారా? లేదా అన్నది ఓటర్ల మదిలో ఉన్న ప్రశ్న.

ఇదీ కథా కమామీషు..!

షాద్నగర్ నియోజకవర్గం లో 1952లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా బూర్గుల రామకృష్ణారావు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నగర్ అవతరించింది. ఆ తర్వాత రెండుసార్లు 1985లో ఎం ఇందిర 1994లో బక్కని నరసింహులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారుతున్న కాలానుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 2014లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజాబలంతో గెలుపొందారు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా మళ్లీ అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వరుసగా రెండుసార్లు విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2023లో జరగబోయే ఎన్నికల్లో కారు స్పీడ్ కు కాంగ్రెస్, బిజెపిలో కళ్లెం వేస్తారా లేదా అన్నది ప్రశ్న. సిపిఎం, సిపిఐ, బీఎస్పి పార్టీల దారేటు..? అన్న ఉత్కంఠ కూడా నెలకొంది.

దండిగా ఓటు బ్యాంకు కొల్లగొట్టిన “గులాబీ”

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గులాబీ శ్రేణుల కారు స్పీడుకు ఏ పార్టీ ముందర నిలబడలేదు. షాద్ నగర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. 2009 ఎన్నికల నుండి ఓసారి రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 44% ఓట్లు నియోజకవర్గంలో పోలయ్యాయి. టిఆర్ఎస్ పార్టీకి 37% ఓట్లు పోలయ్యాయి. బిజెపి మిగతా పార్టీలకు 12 శాతం ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి నాగమూశాతం టిఆర్ఎస్ పార్టీకి 37% బిజేపి ఇతర పార్టీలకు 19 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే టిఆర్ఎస్ పార్టీకి 45 శాతం కోట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి అదేవిధంగా బిజెపికి ఇతర పార్టీలకు కలిపి 20 శాతం ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 2014 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి 42 శాతం ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి 33% కోట్లు పోలయ్యాయి అదే విధంగా బిజెపి తదితర పార్టీలకు 26% ఓట్లు పోలయ్యాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే టిఆర్ఎస్ పార్టీకి 43% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 31 శాతం ఓట్లు పోలయ్యాయి. బిజెపి ఇతర పార్టీలకు కలిపి మొత్తం 25% ఓట్లు పోలయ్యాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే టిఆర్ఎస్ పార్టీకి 44% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 26% ఓటు పోలయ్యాయి. బిజెపి ఇతర పార్టీలకు 29% ఓట్లు పోలయ్యాయి. 2009 నుండి 2018 వరకు జరిగిన మూడు పర్యాయాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 2009 ఎన్నికల్లో మినహా కాంగ్రెస్ పార్టీ మిగతా రెండు పర్యాయాలు చతికిలబడింది. బిజెపి పార్టీ అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఒక పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గత ఎన్నికల్లో డీకే అరుణ వచ్చాక బిజెపిలో గణనీయమైన ఓటు బ్యాంకు పెరిగింది. అది ఎంత అంటే కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో బిజెపి ముందంజలో ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో అంజయ్య “జైత్రయాత్ర” ఇలా..?

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి అంజయ్య ఎలగనమోని కారు గుర్తుపై 70,315 (45.37%) ఓట్లు వచ్చాయి. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చేతి గుర్తుపై 52987 (34.19%) ఓట్లు సాధించారు. శ్రీవర్దన్ రెడ్డి నెల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తుపై 20,425
(13.18%) ఓట్లు వచ్చాయి.
ఇక ఏనుగు మహేందర్ రెడ్డి
స్వతంత్ర ఆటో-రిక్షా 5108
(3.3%), బొబ్బిలి సుధాకర్ రెడ్డి వైయస్సార్ పార్టీ, సీలింగ్ ఫ్యాన్ 1713 (1.11%), అందరి అంజయ్య స్వతంత్ర అభ్యర్థి గ్యాస్ స్టవ్ 949 (0.61%) ఓట్లు వచ్చాయి. ఇక నోటా 846 (0.55) ఓట్లు పోలయ్యాయి. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు అంజయ్య ఎలగనమోని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా
కారు గుర్తుపై 72, 315 (43.43%) ఓట్లు పోలయ్యాయి. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అభ్యర్ధిగా కాంగ్రెస్ చేతి గుర్తుపై 51890
(31.16%) ఓట్లు వచ్చాయి. వీర్లపల్లి శంకర్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున ఏనుగు గుర్తుపై 27,814 (16.7%) కోట్లు తెచ్చుకున్నారు. నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
కమలం గుర్తుపై 5162 (3.1%), అంధరి అంజయ్య స్వతంత్ర అభ్యర్ధి ట్రక్ గుర్తుపై 3199 (1.92%), అమ్మీ సంతోష్ కుమార్ స్వతంత్ర అభ్యర్ధి రోడ్ రోలర్ గర్తుపై పై 2301 (1.38%) ఓట్లు వచ్చాయి. నోటా గుర్తుపై 1909 (1.15%) ఓట్లు పోలయ్యాయి.

ఇందుమూలంగా …

ఇందుమూలంగా చెప్పేది ఎందంటే.. షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ బలమైన ఓటు బ్యాంకుతో ఉన్నారు. గులాబీ పార్టీని ఢీ కొట్టాలి అంటే కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీలు పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగాలి. లేదంటే గెలుపు వాకిట్లో బోర్లా పడక తప్పదు. అదేవిధంగా ఆయా పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే.. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని అంశాలు ఆ పార్టీకి అనుకూలిస్తాయి. సంక్షేమ పథకాలు అభివృద్ధి పై టిఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాత్రం ప్రజా వ్యతిరేకత అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన పనులు చేయకపోవడం టిఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తదితర కారణాలను తన విజయానికి సోపానాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందుకు తెచ్చి నువ్వా నేనా? అన్న తీరుతో ఈ రెండు పార్టీలు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాయి. ఇక బిజెపి విషయానికి వస్తే 6 నెలల క్రితం ఉన్న బిజెపిని గమనిస్తే రాష్ట్రంలో చాలా చోట్ల అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని అనుకున్నారు. అలాగే షాద్ నగర్ అసెంబ్లీలో కూడా ఈసారి కాషాయ జెండా ఎగురుతుందని భావించారు. బండి సంజయ్ మార్పుతో పార్టీ కొంత డీలా పడింది. అంతేకాదు అభ్యర్థి ఎంపికలో కూడా తలనొప్పి వీడలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి త్వరగా రంగంలోకి దిగితే కొంత ఆశాజనకంగా ఉంటుంది. అభ్యర్థిని డిక్లేర్ చేయకపోతే భారతీయ జనతా పార్టీకి నష్టం తప్పదు. ఆ పార్టీలో ఏపీ మిథున్ రెడ్డి, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదివరకే పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రచార రంగంలో దూకారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మంచి జోరుతో ఉన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య పక్కలో బల్లెంలా ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డిని ఈజీగా తీసుకుంటే ఈ రెండు పార్టీలు పప్పులో కాలేసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. 2023 ఎన్నికల్లో ఏ పార్టీని అధికారం వరిస్తుందో ప్రజలు ఎవరిని దయ తలుచుతారో చూద్దాం..!

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!