అడుగుకో గుంతతో వాహనదారుల అగచాట్లు…
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 29, మహానంది:
మహానంది మండలంలోని బోయలకుంట్ల రహదారి మీద ఎం .సి. ఫారం గ్రామం నుండి మహానంది పుణ్యక్షేత్రం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి అడుగు కో గుంతతో వాహనదారులకు దర్శనమిస్తుంది. మండలంలో గత రాత్రి కురుసిన వర్షానికి ఈ గుంతలలో నీరు చేరి రహదారులు వాహనదారులకు చెరువుల వలే దర్శనమిస్తూ అటుగా వచ్చే వాహనదారులకు అగచాట్లకు గురి చేస్తున్నాయి. శ్రీశైలం, తిరుపతి క్షేత్రాల నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారే కాక మన తెలుగు రాష్ట్రాల నుండి మహానంది పుణ్యక్షేత్రం నకు ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తుల వాహనాలు ఈ రహదారుల గుండానే రావలసి ఉన్నది. కొత్తగా క్షేత్రానికి వచ్చే వాహనదారులకు చెరువుల వలే కనిపిస్తున్న ఈ రహదారులు చూసి దారి తప్పి అడవులలోకి వెళ్ళామా అనే పరిస్థితి నెలకొంది. ఈ రహదారి గుండా క్షేత్రానికి వచ్చిన భక్తులు చాలా పర్యాయాలు వారి వాహనాలు ఈ గుంతలలో ఇరుక్కొని వాహనాలు రిపేర్లు వచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి.అదేవిధంగా మహనంది క్షేత్రానికి వచ్చే భక్తులే కాకుండా మండలంలో ముఖ్య పంట అయిన అరటి పంట ఎగుమతి చేయాలి అంటే ఈ రోడ్డు గుండ నే లారీలు, టర్బోలు, జీపులు తిరగవలసి ఉంటుంది. ఆ వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. మహానంది పుణ్యక్షేత్రానికి కోట్లలో ఆదాయం ఉన్న క్షేత్రానికి వచ్చే భక్తుల కనీస వసతులలో ముఖ్యమైన రహదారులు ఎవరు పట్టించుకోవడం లేదు అందులో ఆంతర్యమేమిటో అని భక్తులు కూడా విమర్శలు గుప్పిస్తున్న వైనం. ఈ వర్షాకాలంలో వాహనదారుల పరిస్థితి మరీ దారుణం. అడుగుకో గుంతతో ఆ గుంతలలో వర్షపు నీరు చేరడంతో చెరువులు నీటి కుంటల వలె రహదారులు కనిపిస్తున్నాయి. మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులు మరియు స్థానికులు,రైతులు ఈ గుంతల రోడ్ల వలన వారి అవస్థలు చూసి ఇప్పటికైనా పాలకులు, నాయకులు, అధికారులు ఈ రోడ్లను బాగు చేయాలని అంతే కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.